India vs Canada T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ఇప్పటికే సూపర్ 8 చేరుకుంది. నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్ లో కెనడాతో ఆడబోతోంది. వరుసగా మూడు మ్యాచ్ లైతే గెలిచింది కానీ కొన్ని బలహీనతలు మాత్రం అలాగే ఉన్నాయి. ఓపెనర్ గా కోహ్లి వైఫల్యం వేధిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్ లో ఓపెనింగ్ అతడే చేస్తాడా లేక యశస్విని తీసుకుంటారా? అసలు తుది జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా అన్నది చూడాలి.
సూపర్ 8కు వెళ్లామన్న ఆనందం కన్నా.. తొలి మూడు మ్యాచ్ లలో ఓపెనర్ గా వచ్చిన కోహ్లి వైఫల్యం కలిగించే బాధే ఎక్కువగా ఉంది. అతడు మూడు మ్యాచ్ లలో కేవలం ఐదు పరుగులే చేశాడు. యూఎస్ఏతో అయితే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో సూపర్ 8 స్టేజ్ కు ముందు తిరిగి ఫామ్ లోకి రావడానికి కెనడాతో మ్యాచ్ కు మించిన అవకాశం కోహ్లికి ఉండదు.
న్యూయార్క్ లోని పిచ్ కంటే ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం పిచ్ కాస్త బ్యాటింగ్ కు అనుకూలం. ఈ నేపథ్యంలో విరాట్ తిరిగి ఫామ్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక కోహ్లి విఫలమవుతున్నా పంత్, సూర్యకుమార్ లాంటి వాళ్ల ఫామ్ మాత్రం టీమిండియాకు కలిసొచ్చేదే అని చెప్పాలి. తొలి రెండు మ్యాచ్ లలో విఫలమైన శివమ్ దూబె కూడా యూఎస్ఏతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.
బౌలింగ్ కు అనుకూలించిన న్యూయార్క్ పిచ్ పై తొలి మూడు మ్యాచ్ లలో టీమిండియా బౌలర్లు చెలరేగారు. బుమ్రాతోపాటు అర్ష్‌దీప్, హార్డిక్ లాంటి వాళ్లు సక్సెస్ అయ్యారు. జడేజా, సిరాజ్ నుంచే ఆశించిన మేర ప్రదర్శన కనిపించలేదు. దీంతో ఈ చివరి లీగ్ మ్యాచ్ కు తుది జట్టులో ఒక మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అక్షర్ లేదా జడేజా స్థానంలో కుల్దీప్ లేదా చహల్ రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు కెనడా అంత అనుభవం లేని జట్టే అయినా.. ఐర్లాండ్ పై స్ఫూర్తిదాయక విజయం సాధించింది. పాకిస్థాన్ పైనా పోరాడింది. మరి అలాంటి జట్టుతో టీమిండియా ఎలా ఆడబోతోంది? ఓటమి లేకుండా లీగ్ స్టేజ్ ను ముగిస్తారా అన్నది చూడాలి.
ఇప్పటికే గ్రూప్ ఎ నుంచి ఇండియా, యూఎస్ఏ సూపర్ 8 స్టేజ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. శుక్రవారం (జూన్ 14) అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో పాకిస్థాన్ ఇంటికెళ్లిపోయింది. ఆదివారం ఐర్లాండ్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నా.. అది నామమాత్రపు పోరుగా మిగిలిపోనుంది. ఆడిన తొలి టీ20 వరల్డ్ కప్ లోనే యూఎస్ఏ సూపర్ 8 స్టేజ్ చేరడం విశేషం.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్