India vs Australia Semi Final: దెబ్బకు దెబ్బ.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. విరాట్ హాఫ్ సెంచరీ-india vs australia semi final live team india beat australia champions trophy semi final virat kohli kl rahul ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Australia Semi Final: దెబ్బకు దెబ్బ.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. విరాట్ హాఫ్ సెంచరీ

India vs Australia Semi Final: దెబ్బకు దెబ్బ.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. విరాట్ హాఫ్ సెంచరీ

Hari Prasad S HT Telugu

India vs Australia Semi Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరింది టీమిండియా. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి దెబ్బకు దెబ్బ తీసింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి మరోసారి చెలరేగిన వేళ ఇండియన్ టీమ్ తిరుగులేని విజయం సాధించింది.

దెబ్బకు దెబ్బ.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. విరాట్ హాఫ్ సెంచరీ (BCCI- X)

India vs Australia Semi Final: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది టీమిండియా. 265 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి 84 పరుగులకు తోడు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ తో టీమిండియా ఫైనల్ చేరింది. 

మరో 11 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. మ్యాచ్ ను తనదైన స్టైల్లో సిక్స్ తో ముగించిన కేఎల్ రాహుల్ 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడు 34 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 42 రన్స్ చేయడం విశేషం. హార్దిక్ 28, అక్షర్ 27 రన్స్ చేశారు. బుధవారం (మార్చి 5) సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరగబోయే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం (మార్చి 9) ఫైనల్లో టీమిండియా తలపడుతుంది.

విరాట్, శ్రేయస్ పార్ట్‌నర్‌షిప్.. గేమ్ ఛేంజర్

టీమిండియా 265 పరుగుల చేజింగ్ లో 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (8), రోహిత్ శర్మ (28) విఫలమయ్యారు. అయితే ఆ విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ భాగస్వామ్యం మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఈ ఇద్దరూ ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా ఆడుతూపాడుతూ టార్గెట్ వైపు వెళ్లారు. ఈ క్రమంలో విరాట్ మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 111 బంతుల్లో 91 రన్స్ జోడించారు. దీంతో మ్యాచ్ ఆస్ట్రేలియా చేతుల్లో నుంచి చేజారింది.

శ్రేయస్ ఔటైనా.. తర్వాత అక్షర్ పటేల్ తో కలిసి విరాట్ మరో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అక్షర్ కూడా తన వంతు పాత్ర పోషిస్తూ 27 రన్స్ చేశాడు. అతడు ఔటైన తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ మొదటి నుంచీ దూకుడుగా కనిపించాడు. అతడు విరాట్ తో కలిసి ఐదో వికెట్ కు 47 రన్స్ జోడించాడు. కోహ్లి వన్డేల్లో 52వ సెంచరీ, ఇండియా విజయం రెండూ ఖాయమనుకున్నా.. అనూహ్యంగా అతడు 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ అనవసర షాట్ కోసం ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.

ఆస్ట్రేలియా ఫైటింగ్ స్కోరు

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆలౌటైంది. షమి 3, వరుణ్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. రెండేళ్లుగా ఇండియాకు కొరకరాని కొయ్యగా మారిన ట్రావిస్ హెడ్ ను ఈ మ్యాచ్ లో మన బౌలర్లు త్వరగానే ఔట్ చేశారు. మొదట్లోనే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. 35 బంతుల్లో 39 రన్స్ చేసి ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి అతన్ని ఔట్ చేశాడు.

అయితే స్మిత్, కేరీలను కట్టడి చేయలేకపోవడంతో ఆస్ట్రేలియా 264 పరుగుల ఫైటింగ్ స్కోరు చేయగలిగింది. ఓపెనర్ కూపర్ కోనలీ (0), లబుషేన్ (29), జోష్ ఇంగ్లిస్ (11), మ్యాక్స్‌వెల్ (7) విఫలమయ్యారు.

స్టీవ్ స్మిత్ పోరాటం

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. మొదట ఓపెనర్ ట్రావిస్ హెడ్ తో కలిసి రెండో వికెట్ కు 50 పరుగులు, తర్వాత లబుషేన్ తో కలిసి మూడో వికెట్ కు 56 పరుగులు జోడించాడు. టీమిండియా స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ నెమ్మదిగా అయినా పరుగులు చేస్తూ వెళ్లాడు.

ఈ క్రమంలో వన్డేల్లో మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మిత్ 96 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 73 రన్స్ చేశాడు. షమి బౌలింగ్ లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆస్ట్రేలియా ఫైటింగ్ స్కోరు సాధించిందంటే దానికి స్మిత్ ఆడిన కీలక ఇన్నింగ్స్ కారణమని చెప్పొచ్చు.

అలెక్స్ కేరీ కౌంటర్ అటాక్

స్మిత్ నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేసుకోగా.. అలెక్స్ కేరీ మాత్రం ధాటిగా ఆడుతూ టీమిండియా బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. జోష్ ఇంగ్లిస్ (11), మ్యాక్స్‌వెల్ (7) లాంటి హిట్టర్లు విఫలమైనా.. కేరీ మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నాడు. స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఎదురు దాడికి దిగాడు.

అతడు 57 బంతుల్లోనే 61 రన్స్ చేశాడు. 48వ ఓవర్ తొలి బంతికి శ్రేయస్ అయ్యర్ డైరెక్ట్ హిట్ కు రనౌటై వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. కేరీ అటాక్ తోనే ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.