India vs Australia: ఎంత పని చేశావ్ పాంటింగ్.. కోహ్లిని రెచ్చగొట్టడమేంటి: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెంట్స్
India vs Australia: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కు క్లాస్ పీకాడు ఆ టీమ్ మాజీ క్రికెటర్ షేన్ లీ. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని రెచ్చగొట్టేలా మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.
India vs Australia: ఇండియా, ఆస్ట్రేలియా ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతోంది. సహజంగానే యాషెస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉండే ఈ సిరీస్ కు ముందు క్రికెట్ పండితుల అంచనాలు, ఇరు జట్ల మధ్య మాటల యుద్ధంలాంటివి మొదలయ్యాయి. అలా ఈ మధ్యే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చేసిన కామెంట్స్ పై మరో మాజీ షేన్ లీ మండిపడ్డాడు. తప్పు చేశావని అన్నాడు.
తప్పు చేశావ్.. పాంటింగ్: షేన్ లీ
విరాట్ కోహ్లిని రెచ్చిగొడితే ఏమవుతుందో ప్రత్యర్థి జట్లకు బాగా తెలుసు. అందుకే అతన్ని అలా వదిలేయాలని ప్రతి సిరీస్ కు ముందు ప్రత్యర్థి ప్లేయర్స్ కు సూచనలు ఇస్తుంటారు. కానీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం ఈ విషయంలో తప్పు చేశాడని మాజీ క్రికెటర్ షేన్ లీ అన్నాడు.
"రికీ.. చాలా తప్పు చేశావ్. ఏం చేస్తున్నావ్ అసలు? ఆ వ్యక్తిని నువ్వు రెచ్చగొడుతున్నావ్. అతడో వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఇక్కడికి వచ్చి అతడు చెలరేగుతాడు" అని ఫాక్స్ క్రికెట్ పాడ్‌కాస్ట్ ది ఫాలో ఆన్ లో మాట్లాడుతూ షేన్ లీ అన్నాడు.
పాంటింగ్ ఏమన్నాడంటే?
విరాట్ కోహ్లి కొన్నాళ్లుగా అసలు ఫామ్ లో లేడు. ఈ మధ్యే న్యూజిలాండ్ తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్ లోనూ కేవలం 15.5 సగటుతో 93 పరుగులు చేశాడు. వీటిని ఎత్తి చూపుతూ ఇది ఆందోళన కలిగించే విషయమే అని రికీ పాంటింగ్ అన్నాడు.
"విరాట్ గురించి ఈ మధ్య నేను ఓ ఆసక్తికర విషయం గమనించాను. గత ఐదేళ్లలో అతడు కేవలం రెండే టెస్టు సెంచరీలు చేశాడు. అది నాకు సరిగా అనిపించడం లేదు. అదే నిజమైతే ఇది ఆందోళన కలిగించే విషయమే. గత ఐదేళ్లుగా ఆడుతూ కేవలం రెండే టెస్టు సెంచరీలు చేసిన మరో బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్ లో ప్రస్తుతం లేకపోవచ్చు" అని పాంటింగ్ అన్నాడు.
సిరీస్ సమం అవుతుంది: షేన్ లీ
పాంటింగ్ చేసిన ఈ కామెంట్స్ ను తప్పుబట్టిన షేన్ లీ.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమస్యలను కూడా ఎత్తి చూపుతూ సిరీస్ 2-2తో సమం అవుతుందని అంచనా వేయడం విశేషం. "ఈ సిరీస్ అద్భుతంగా సాగనుంది. కాస్త ఘాటుగా కూడా ఉండే అవకాశం ఉంది. ఇండియా ఎ టీమ్ పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు, ఇప్పుడు కోహ్లిపై పాంటింగ్ కామెంట్స్ అదే చెబుతున్నాయి.
స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్, లయన్ రూపంలో వరల్డ్ క్లాస్ బౌలింగ్ లైనప్ ఆస్ట్రేలియా దగ్గర ఉంది. కానీ బ్యాటింగ్ సమస్య కూడా ఉంది. చాలా రోజుల తర్వాత ఇంత బలహీనంగా ఉన్న ఆస్ట్రేలియా టెస్టు బ్యాటింగ్ లైనప్ చూస్తున్నాము. మెక్‌స్వీనీ వస్తున్నాడు కానీ అతడిపై ఒత్తిడి ఉంటుంది. అతడు ఎప్పుడూ ఓపెనర్ గా ఆడలేదు. ఖవాజా ఒక్కడే నా వరకూ కాస్త ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. అతడు బాగా ఆడతాడు. లబుషేన్ ఫామ్ లో లేడు. స్టీవ్ స్మిత్ కూడా. బుమ్రాలాంటి పేస్ బౌలింగ్ అటాక్ ను వీళ్లు ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి" అని లీ అన్నాడు.