Rohit Sharma Out: ఐదో టెస్టు ఆడబోనని చెప్పిన రోహిత్ శర్మ.. తన చివరి టెస్టు ఆడేసినట్లేనా?
Rohit Sharma Out: రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదో టెస్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తన కెరీర్లో అతడు చివరి టెస్టు ఆడేసినట్లే అని కూడా సమాచారం. తన నిర్ణయాన్ని హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కు చెప్పినట్లు తెలిసింది.
Rohit Sharma Out: ఊహించిందే జరిగేలా ఉంది. ఆస్ట్రేలియాతో చివరిదైన ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకున్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు వెల్లడించింది. ఈ మ్యాచ్ తాను ఆడబోనని అతడు గంభీర్, అగార్కర్ లతో చెప్పినట్లు ఆ రిపోర్టు తెలిపింది. రోహిత్ లేకపోవడంతో బుమ్రా మరోసారి కెప్టెన్సీ చేపట్టనున్నాడు. తుది జట్టులోకి శుభ్‌మన్ గిల్ రాబోతున్నాడు.
రోహిత్ చివరి టెస్టు ఆడేసినట్లేనా?
ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు రోహిత్ దూరం కానున్నాడన్న వార్తలతో ఇక అతడు తన కెరీర్లో చివరి టెస్టు ఇప్పటికే ఆడేసినట్లు భావిస్తున్నారు. టెస్టులకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగి ఈ మ్యాచ్ ఆడాల్సిందిగా రోహిత్ ను కోరితే తప్ప ఇక అతడు కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసినట్లే అని టీమ్ వర్గాలు వెల్లడించాయి. టీమిండియా తరఫున రోహిత్ శర్మ 67 టెస్టులు ఆడాడు.
అయితే కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల్లో కలిపి 31 పరుగులే చేశాడు. అటు టీమ్ కూడా బుమ్రా కెప్టెన్సీలో తొలి టెస్టు గెలవగా.. తర్వాత రోహిత్ కెప్టెన్సీలో రెండింట్లో ఓడిపోయింది. దీంతో ఇక అతడు రిటైర్మెంట్ ప్రకటించాలన్న డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ చివరి టెస్టుకు దూరం కానున్నాడు. గురువారం (జనవరి 2) జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు కూడా రోహిత్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు.
బుమ్రాకు కెప్టెన్సీ.. జట్టులోకి గిల్
రోహిత్ ఆడకపోతే బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగనుంది. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులోనూ రోహిత్ లేకపోవడంతో బుమ్రా కెప్టెన్సీలో ఆడి గెలిచింది. ఇక ఇప్పుడు చివరి టెస్టు కూడా అతడే కెప్టెన్ కానున్నాడు. రోహిత్ స్థానంలో తుది జట్టులోకి శుభ్‌మన్ గిల్ రానున్నాడు. చివరి టెస్టు ప్రెస్ కాన్ఫరెన్స్ కు రోహిత్ స్థానంలో కోచ్ గంభీర్ రావడం.. తుది జట్టులో రోహిత్ ఉంటాడా అన్న ప్రశ్నకు గంభీర్ స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతోనే సిడ్నీ టెస్టుకు రోహిత్ దూరం కానున్నాడన్న వార్తలు మొదలయ్యాయి.
ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలుపుకోవాలన్నా, డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలన్నా కచ్చితంగా సిడ్నీ టెస్టు గెలవాల్సిన పరిస్థితిలో టీమిండియా ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉండటంతో చివరి మ్యాచ్ ఆ టీమే గెలిచినా, డ్రా అయినా ఫైనల్ రేసు నుంచి ఇండియన్ టీమ్ తప్పుకుంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా చేజారుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జనవరి 3) నుంచి సిడ్నీలో ప్రారంభం కానున్న చివరి టెస్టులో ఏం జరుగుతుంది? బుమ్రా కెప్టెన్సీలో టీమ్ మళ్లీ కోలుకుంటుందా అన్నది చూడాలి.