India vs Australia 4th Test: ఓపెనర్‌గా రోహిత్ శర్మ.. తుది జట్టులోకి వాషింగ్టన్ సుందర్.. నాలుగో టెస్టుకు టీమ్ ఇదేనా?
India vs Australia 4th Test: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి నెలకొంది. కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉండగా.. వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
India vs Australia 4th Test: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు గురువారం (డిసెంబర్ 26) ఉదయం 5 గంటల నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. వరుసగా విఫలమవుతున్న శుభ్‌మన్ గిల్ ను పక్కన పెట్టి.. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓపెనర్‌గా రోహిత్ శర్మ?
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమై రెండో టెస్టుకు వచ్చినప్పటి నుంచీ కెప్టెన్ రోహిత్ శర్మ రాణించలేదు. తన ఓపెనర్ స్థానాన్ని రాహుల్ కు వదిలేసి మిడిలార్డర్ లో ఆడుతున్నాడు. అయితే కీలకమైన బాక్సింగ్ డే టెస్టుకు రోహిత్ మళ్లీ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండే పరిస్థితుల్లో ఈ మ్యాచ్ కు తుది జట్టు ఎంపిక విషయంలోనూ ఇండియన్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు చేయాలని భావిస్తోంది.
ఇందులో భాగంగానే మరోసారి రోహిత్ శర్మను ఓపెనర్ గా పంపాలని చూస్తున్నారు. యశస్వితో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేస్తే.. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో ఆడతాడు. వరుసగా విఫలమవుతున్న శుభ్‌మన్ గిల్ ను తప్పించే అవకాశం ఉంది. అతని స్థానంలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి తీసుకోవచ్చు.
ఓపెనర్‌గానే రోహిత్ రికార్డు
టెస్టుల్లో 2019 నుంచి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తున్నాడు. ఓపెనర్ గా 42 టెస్టుల్లో 44.01 సగటుతో 2685 రన్స్ చేశాడు. అందులో 9 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 212. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లోనూ రోహితే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అతడు 42.25 సగటుతో 2704 రన్స్ చేశాడు. దీంతో మరోసారి రోహిత్ ను ఓపెనర్ గా పంపిస్తే రాణించే అవకాశాలు ఉన్నాయి.
మూడో స్థానంలో రాహుల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, ఐదో స్థానంలో రిషబ్ పంత్ వస్తే.. ఆరో స్థానంలో రవీంద్ర జడేజా, ఏడో స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని దింపనున్నారు. సుందర్ రూపంలో మరో ఆల్ రౌండర్ కూడా తుది జట్టులోకి వస్తాడు. దీంతో బ్యాటింగ్ తోపాటు బౌలింగ్ కూడా పటిష్టంగా మారుతుందన్నది టీమ్ మేనేజ్మెంట్ ఉద్దేశంగా కనిపిస్తోంది. మెల్‌బోర్న్ టెస్టులో ఇద్దరు స్పిన్నర్లను బరిలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది.
టీమిండియా తుది జట్టు అంచనా
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్