IND vs AUS 2nd Test Day 1 Highlights: డే/నైట్ టెస్టులో తొలిరోజు భారత్‌కి తప్పని నిరాశ.. ఆతిథ్య ఆస్ట్రేలియాదే పైచేయి
India vs Australia 2nd Test: పింక్ బాల్‌తో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టుకి మరోసారి చేదు అనుభవం తప్పలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమవగా.. భారత్ బౌలర్లు కూడా ప్రభావం చూపలేకపోయారు. దాంతో ఈరోజు ఆట ముగిసే సమయానికి..
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ జట్టుకి మొదటి రోజు నిరాశ తప్పలేదు. డే/నైట్ ఫార్మాట్‌లో పింక్ బాల్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 180 పరుగులకే ఆలౌటైంది.
10 వికెట్లు సమర్పించి.. ఒక్క వికెట్
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా టీమ్ ఈరోజు ఆట ముగిసే సమయానికి 86/1తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో మార్కస్ లబుషేన్ (20 బ్యాటింగ్: 67 బంతుల్లో 3x4), నాథన్ (38 బ్యాటింగ్: 97 బంతుల్లో 6x4) ఉన్నారు. ఆస్ట్రేలియా ఇంకా 94 పరుగులు వెనకబడి ఉంది. ఈరోజు 44.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 10 వికెట్లు సమర్పించుకున్న భారత్ జట్టు.. అనంతరం 33 ఓవర్లు వేసి తీసింది ఒక్క వికెట్ మాత్రమే.
ఆస్ట్రేలియా గడ్డపై పింక్ బాల్ టెస్టులో భారత్ జట్టుకి మెరుగైన రికార్డ్ లేదు. మూడేళ్ల క్రితం కేవలం 36 పరుగులకే ఆలౌటై చేదు అనుభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా.. ఈరోజు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది.
కోహ్లీ, రోహిత్ సింగిల్ డిజిట్‌కే
విరాట్ కోహ్లీ (7), రోహిత్ శర్మ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైపోగా.. యశస్వి జైశ్వాల్ (0) కూడా నిరాశపరిచాడు. కానీ.. కేఎల్ రాహుల్ (37), శుభమన్ గిల్ (31), నితీశ్ కుమార్ రెడ్డి (42) ఫర్వాలేదనిపించడంతో భారత్ జట్టు 180 పరుగులైనా చేయగలిగింది.
ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన రికార్డ్ ఉన్న రిషబ్ పంత్ కూడా 21 పరుగులకే ఔటైపోయాడు. పింక్ బాల్‌తో నిప్పులు చెరిగిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 14.1 ఓవర్లలోనే 48 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
బుమ్రా మాత్రమే
కానీ.. భారత్ బౌలర్లు మాత్రం పింక్ బాల్‌తో వికెట్లు తీయలేకపోయారు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (13: 35 బంతుల్లో 2x4) వికెట్‌ను మాత్రమే జస్‌ప్రీత్ బుమ్రా తీయగలిగాడు.
మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేసినా ప్రభావం చూపలేకపోయారు. ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.