IND vs AUS Pink Ball Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి డే/నైట్ టెస్టు.. మ్యాచ్ టైమింగ్స్ ఏంటంటే?
India vs Australia 2nd Test Match Timings: ఆస్ట్రేలియా గడ్డపై మూడేళ్ల తర్వాత భారత్ జట్టు డే/నైట్ టెస్టుని ఆడబోతోంది. చివరిగా ఆడినప్పుడు 36 పరుగులకే ఆలౌటైన టీమిండియా.. ఈసారి బదులు తీర్చుకోవాలని ఆశిస్తోంది. ఇంతకీ ఈ మ్యాచ్ టైమింగ్స్ ఏంటంటే?
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-2025 ఫైనల్‌కి చేరాలని ఉవ్విళ్లూరుతున్న భారత్ జట్టు.. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో రెండో టెస్టుని ఆడబోతోంది. అడిలైడ్ ఓవల్ మైదానం ఆతిథ్యం ఇస్తున్న ఈ టెస్టు మ్యాచ్ పింక్‌బాల్‌తో డే/నైట్ ఫార్మాట్‌లో జరగనుంది. పెర్త్ టెస్టులో ఇటీవల ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
పెర్త్ టెస్టుకి దూరంగా ఉన్న రోహిత్ శర్మ, శుభమన్ గిల్ రీఎంట్రీ ఇవ్వగా.. ఈ ఇద్దరి స్థానాల్లో ఆడిన దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్‌పై వేటు పడనుంది. అదే సమయంలో వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పింక్ బాల్ టెస్టుల్లో అశ్విన్‌కి మంచి రికార్డ్ ఉంది.
ఆస్ట్రేలియా గడ్డపై ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుండటంతో.. మ్యాచ్ టైమింగ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
భారత్-ఆస్ట్రేలియా డే/నైట్ టెస్టు మ్యాచ్ ఎప్పుడు?
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 వరకు జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
అడిలైడ్ ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 2021లో ఇక్కడే జరిగిన డే/నైట్ టెస్టులో భారత్ జట్టు 36 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటం ఎలా?
భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ లైవ్‌ను టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని ఛానెల్స్‌లో చూడొచ్చు.
ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడొచ్చు
భారత్ ఆస్ట్రేలియా రెండో టెస్టు మ్యాచ్ ఆన్‌లైన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు.
తొలి రోజు ఆట సెషన్స్ ఇలా
వాస్తవానికి ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఈ టెస్టు మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది, అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ లెక్కన భారత కాలమానం ప్రకారం ఉదయం 9:00 గంటలకే టాస్ పడుతుంది.
ఈ టెస్టు తొలి సెషన్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత 40 నిమిషాలు లంచ్ బ్రేక్
రెండో సెషన్ మధ్యాహ్నం 12:10 గంటలకి మొదలై.. మధ్యాహ్నం 2:10 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత 20 నిమిషాలు టీ విరామం
అనంతరం మూడో సెషన్ 2.30 గంటలకి ప్రారంభమై.. సాయంత్రం 4:30 గంటలకు ముగియనుంది.
మ్యాచ్ సమయంలో వర్షం కురిసినా లేదా మరేదైనా కారణంతో మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వస్తే.. మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పులు ఉంటాయి.