India vs Australia: ఇండియా, ఆస్ట్రేలియాలాంటి బలమైన టీమ్స్ ఆడుతున్నాయి. అందులోనూ ఇండియా స్వదేశంలో ఆడుతున్న మ్యాచ్. ఇలాంటి మ్యాచ్ కు టికెట్లు దొరకడమే కష్టమని అనుకుంటాం. కానీ మొహాలీ స్టేడియంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొలి వన్డే జరుగుతున్న ఐఎస్ బింద్రా స్టేడియంలో చాలా వరకూ సీట్లు ఖాళీగానే ఉండటం గమనార్హం.
ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కొన్ని కేటగిరీల టికెట్లకు వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా పెట్టడం విశేషం. స్టూడెంట్స్ కోసం పెట్టి రూ.100 టికెట్లు మాత్రం పూర్తిగా అమ్ముడయ్యాయి. ఇక రూ.1000, రూ.5000 టికెట్లు కూడా అందుబాటులో లేవు. ఇవి కాకుండా రూ.3 వేలు, రూ.10 వేలు, రూ.20 వేల టికెట్లపై మాత్రం పీసీఏ ఆఫర్ ప్రకటించింది.
ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని చెప్పింది. అయినా ఎవరూ ఆసక్తి చూపలేదు. స్టేడియం దగ్గర ఉన్న కౌంటర్లతోపాటు పలు ఇతర బ్యాంకుల్లోనూ ఈ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంచింది. అయినా కౌంటర్ల దగ్గర జనాలు కనిపించలేదు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి చాలా తక్కువ సంఖ్యలోనే ప్రేక్షకులకు స్టాండ్స్ లో కనిపించారు.
మ్యాచ్ మొదలైన తర్వాత కాస్త నిండినా.. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ లో కనిపించాల్సిన ఫుల్ హౌజ్ మాత్రం మొహాలీలో కనిపించలేదు. నిజానికి ఈ మ్యాచ్ కోసం ఆసియా కప్ జరుగుతున్న సమయంలోనే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ టికెట్ల అమ్మకాలు ప్రారంభించింది. తొలి రోజు కౌంటర్ల దగ్గర కాస్త హడావిడి కనిపించినా.. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు.
మొహాలీలో ఉన్న ఎండ వేడి కూడా దీనికి ఓ కారణంగా భావిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కు రోహిత్, కోహ్లి, హార్దిక్ లాంటి స్టార్లు లేకపోవడం కూడా మరో కారణం కావచ్చు. ఇండియన్ టీమ్ స్వదేశంలో అది కూడా ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టుతో ఆడుతున్నప్పుడు స్టేడియాలు ఇలా ఖాళీగా కనిపించడం అత్యంత అరుదుగా జరిగేదే. సాయంత్రానికి ఇండియా బ్యాటింగ్ సమయంలో కాస్తయినా స్టేడియం నిండుతుందని నిర్వాహకులు ఆశతో ఉన్నారు.