India vs Afghanistan 3rd T20I: రెండు సూపర్ ఓవర్లు.. ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ-india vs afghanistan 3rd t20i two super overs finally team india beat afghanistan ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Afghanistan 3rd T20i: రెండు సూపర్ ఓవర్లు.. ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ

India vs Afghanistan 3rd T20I: రెండు సూపర్ ఓవర్లు.. ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ

Hari Prasad S HT Telugu

India vs Afghanistan 3rd T20I: ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా రెండు సూపర్ ఓవర్ల తర్వత సూపర్ విక్టరీ సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో మంచి థ్రిల్ అందించిన ఈ మ్యాచ్ లో రెండుసార్లు ఓటమి నుంచి తప్పించుకొని చివరికి రెండో సూపర్ ఓవర్లో ఇండియా గెలిచింది.

ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా కళ్లు చెదిరే విజయం (AFP)

India vs Afghanistan 3rd T20I: రెండు సూపర్ ఓవర్లపాటు సాగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో చివరికి ఆఫ్ఘనిస్థాన్ పై ఇండియన్ టీమ్ గెలిచింది. మొదట మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ తప్పలేదు. అయితే అది కూడా టై కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఆ ఓవర్లో ఆఫ్ఘన్ ముందు 12 పరుగుల టార్గెట్ ఉంచగా.. ఆ టీమ్ 1 పరుగే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో ఇండియా విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

మ్యాచ్ మొత్తం కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ తో ఇండియన్ టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఎంతో ఒత్తిడిలో రెండో సూపర్ ఓవర్ వేసిన బిష్ణోయ్.. టీమిండియాకు కళ్లు చెదిరే విజయం అందించాడు. అతడు మూడు బంతుల్లోనే సూపర్ ఓవర్ ముగించాడు. రోహిత్ మొదట అసలు మ్యాచ్ లో 121 రన్స్, తొలి సూపర్ ఓవర్లో 12 రన్స్, రెండో సూపర్ ఓవర్లో 10 రన్స్ చేశాడు.

రెండో సూపర్ ఓవర్లో బంతి రవి బిష్ణోయ్ చేతికి ఇవ్వాలన్న నిర్ణయం టీమిండియాకు కలిసి వచ్చింది. అతడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమ్ కు అనూహ్య విజయం సాధించిపెట్టాడు. అతని లెగ్ స్పిన్ ఆడలేక ఇద్దరు ఆఫ్ఘన్ బ్యాటర్లు మూడు బంతుల వ్యవధిలో ఔటయ్యారు. రెండు క్యాచ్ లను రింకు సింగ్ పట్టుకున్నాడు.

తొలి సూపర్ ఓవర్

తొలి సూపర్ ఓవర్లో మొదట ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ చేసింది. గుర్బాజ్ ఫోర్, నబీ సిక్స్ కొట్టడంతో ఆ టీమ్ ఆరు బంతుల్లో 16 పరుగులు చేసింది. దీంతో టీమిండియా విజయానికి 17 పరుగులు అవసరం అయ్యాయి. నిజానికి సూపర్ చివరి బంతికి సంజూ శాంసన్ విసిరిన బంతి నబీ కాలికి తగిలి వెళ్లింది. అయినా ఆఫ్ఘన్ బ్యాటర్లు రెండు పరుగులు తీశారు. కోహ్లి త్రో విసరకుండా అలా ఎలా తీస్తారని అని అడుగుతుండగానే వాళ్లు మరో పరుగు తీశారు. దీంతో ఆఫ్ఘన్ స్కోరు 16 రన్స్ కు చేరింది.

తర్వాత 17 రన్స్ చేజింగ్ కోసం రోహిత్, యశస్వి వచ్చారు. తొలి రెండు బంతుల్లో రెండు పరుగులే వచ్చాయి. అయితే తర్వాత రెండు బంతులను రోహిత్ సిక్స్ లుగా మలిచాడు. చివరి రెండు బంతులకు 3 పరుగులు అవసరం అయ్యాయి. కానీ రెండు పరుగులే రావడంతో స్కోరు సమమై మరో సూపర్ ఓవర్ తప్పలేదు.

అసలు మ్యాచ్ టై

అంతకుముందు 213 పరుగులు లక్ష్యాన్ని ఆఫ్ఘన్ టీమ్ చేజ్ చేసినంత పని చేసింది. ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్, గుర్బాజ్ హాఫ్ సెంచరీలకు తోడు నబీ మెరుపులు.. చివర్లో గుల్బదిన్ కేవలం 23 బంతుల్లోనే 55 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. చివరి ఓవర్లో విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. 18 వచ్చాయి. చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా.. గుల్బదిన్ రెండు మాత్రమే చేయగలిగాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది.

భారీ లక్ష్యం అయినా కూడా ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మొదటి ఓవర్ నుంచే టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్.. ఇండియన్ పేస్ బౌలర్లను ఎడాపెడా బాదారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 11 ఓవర్లలో 93 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. గుర్బాజ్ 32 బంతుల్లో 50, జద్రాన్ 41 బంతుల్లో 50 రన్స్ చేసి ఔటయ్యారు. అయితే తర్వాత వచ్చిన మహ్మద్ నబీ కేవలం 16 బంతుల్లోనే 34 పరుగులు చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్స్ లు, 2 ఫోర్లు ఉన్నాయి.

రోహిత్ రికార్డు సెంచరీ

అంతకుముందు రోహిత్ శర్మ టీ20ల్లో రికార్డు సెంచరీ సాధించాడు. మెన్స్ టీ20 క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు. టీ20ల్లో అతనికిది 5వ సెంచరీ. గతంలో ఏ ఇతర బ్యాటర్ ఐదు సెంచరీలు చేయలేదు. అంతేకాదు టీ20 క్రికెట్ లో రోహిత్ కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఒక దశలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా.. రోహిత్, రింకు వీరబాదుడుతో చివరికి 212 రన్స్ చేయడం విశేషం.

రోహిత్ శర్మ కేవలం 64 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా టీ20 వరల్డ్ కప్ ముందు 14 నెలలుగా ఈ ఫార్మాట్ ఆడని రోహిత్ ను మళ్లీ టీమ్ లోకి తీసుకోవడంపై విమర్శలు వచ్చినా.. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో అతడు ఆ విమర్శలకు చెక్ చెప్పాడు. మరోవైపు రింకు సింగ్ తాను ఫినిషర్ రోల్లోనే కాదు.. ఎలాంటి పాత్రనైనా పోషించగలనని ఈ ఇన్నింగ్స్ ద్వారా నిరూపించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మొదట్లోనే దిమ్మదిరిగే షాక్ తగిలింది. టాప్ బ్యాటర్లందరూ చెత్త షాట్లతో వికెట్లు పారేసుకోవడంతో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదట భారీ షాట్ కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి తొలి బంతికే షాట్ ఆడటానికి ప్రయత్నించి డకౌటయ్యాడు.

ఐపీఎల్లో తన హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వేల మంది ప్రేక్షకుల కేరింతల మధ్య క్రీజులోకి వచ్చిన విరాట్.. వాళ్లను తీవ్రంగా నిరాశ పరిచాడు. రెండో టీ20లో వేగంగా పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన అతడు.. ఈసారి వచ్చీరాగానే భారీ షాట్ కు ప్రయత్నించి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు.

ఇక తొలి రెండు టీ20ల్లో హాఫ్ సెంచరీలు చేసిన శివమ్ దూబె ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. అతడు కేవలం 1 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ తనకు వచ్చిన మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కోహ్లిలాగే క్రీజులోకి వచ్చిరాగానే భారీ షాట్ కు ప్రయత్నించి తొలి బంతికే గోల్డెన్ డకౌటయ్యాడు. దీంతో టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.