Team India: టీమిండియా తదుపరి మ్యాచ్ ఎప్పుడు? ఇంగ్లండ్‍తో టీ20, వన్డే సిరీస్‍లు.. మ్యాచ్ డేట్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
India vs England ODI, T20I series: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి పాలైన టీమిండియా.. తదుపరి ఇంగ్లండ్‍తో వన్డే, టీ20 సిరీస్‍లు ఆడనుంది. ఈ సిరీస్‍ల మ్యాచ్‍ల తేదీలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు ఓటమి ఎదురైంది. ఆసీస్‍తో ఐదు టెస్టుల సిరీస్‍ను 1-3తో భారత్ కోల్పోయింది. బీజీటీ టైటిల్‍ను నిలబెట్టుకోలేకపోయింది. సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో మూడో రోజైన ఆదివారమే (జనవరి 6) పరాజయం చెందింది. బ్యాటింగ్‍లో ఈ సిరీస్‍లో ఘోరంగా విఫలమైంది టీమిండియా. తదుపరి ఇంగ్లండ్‍తో పరిమిత ఓవర్ల సిరీస్‍ల సమరానికి భారత్ సిద్ధమైంది. సొంతగడ్డపైనే ఇంగ్లిష్ జట్టుతో టీ20, వన్డేలు ఆడనుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 మధ్య ఈ సిరీస్‍లు ఉంటాయి. పూర్తి షెడ్యూల్, లైవ్ వివరాలు ఇవే..
భారత్ తదుపరి మ్యాచ్ ఇదే
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్ ఆడే మ్యాచ్ ఇంగ్లండ్‍తో టీ20. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జనవరి 22వ తేదీన కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‍లో ఐదు టీ20లు ఉండనున్నాయి. ఇవి ముగిశాక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్ మ్యాచ్ తేదీలు
- తొలి టీ20 - జనవరి 22, 2025 - కోల్‌కతా
- రెండో టీ20 - జనవరి 25 - చెన్నై
- మూడో టీ20 - జనవరి 28 - రాజ్‌కోట్
- నాలుగో టీ20 - జనవరి 31 - పుణె
- ఐదో టీ20 - ఫిబ్రవరి 2 - ముంబై
ఈ సిరీస్‍లో ఐదు మ్యాచ్‍లు రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి.
భారత్, ఇంగ్లండ్ వన్డే సిరీస్
- తొలి వన్డే - ఫిబ్రవరి 6 - నాగ్‌పూర్
- రెండో వన్డే - ఫిబ్రవరి 9 - కటక్
- మూడో వన్డే - ఫిబ్రవరి 12 - అహ్మదాబాద్
ఈ మూడు వన్డేలు మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాలకు షురూ అవుతాయి.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్‍లు స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. డిజిటల్ విషయానికి వస్తే.. డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ఓటీటీలో మ్యాచ్‍లు లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి.
రోహిత్, కోహ్లీ ఉంటారా..
ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్‍కు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉంటారా అనేది అంశం ఉత్కంఠగా మారింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‍లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో స్వయంగా చివరి టెస్టుకు జట్టు నుంచి తప్పుకున్నాడు. మరోవైపు విరాటో కోహ్లీ ఓ సెంచరీ తప్ప ఆ సిరీస్‍లో పెద్దగా రాణించలేదు. దీంతో రోహిత్, కోహ్లీపై విమర్శలు భారీగా వస్తున్నాయి. ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్‍కు ఈ ఇద్దరు జట్టులో ఉంటారా అనే విషయంపై టెన్షన్ నెలకొంది. ఈ సిరీస్‍ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఒకవేళ ఇంగ్లండ్‍తో సిరీస్‍ను రోహిత్, విరాట్ ఆడితే.. చాంపియన్స్ ట్రోఫీకి కూడా ఛాన్స్ దక్కినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‍కు రోహిత్, కోహ్లీ ఇప్పటికే గుడ్‍బై చెప్పారు.
బుమ్రా విషయంలో సందిగ్ధత
ఆస్ట్రేలియా సిరీస్‍లో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. ఐదో టెస్టుల్లోనే 32 వికెట్లతో అదరగొట్టేశాడు. చివరి టెస్టుకు కెప్టెన్సీ చేసిన బుమ్రా.. గాయానికి గురయ్యాడు. దీంతో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. దీంతో ఇంగ్లండ్‍తో సిరీస్‍లకు అతడు ఉంటాడా.. చాంపియన్స్ ట్రోఫీ కోసం నేరుగా వస్తాడా అనేది చూడాలి. బుమ్రా గాయం పరిస్థితి గురించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సంబంధిత కథనం