Suryakumar Yadav Fight: తొలి టీ20లో దక్షిణాఫ్రికా క్రికెటర్లతో భారత్ కెప్టెన్ గొడవ, పరుగెత్తుకొచ్చిన అంపైర్లు-india t20i captain suryakumar yadav and marco jansen engage in heated verbal spat ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Suryakumar Yadav Fight: తొలి టీ20లో దక్షిణాఫ్రికా క్రికెటర్లతో భారత్ కెప్టెన్ గొడవ, పరుగెత్తుకొచ్చిన అంపైర్లు

Suryakumar Yadav Fight: తొలి టీ20లో దక్షిణాఫ్రికా క్రికెటర్లతో భారత్ కెప్టెన్ గొడవ, పరుగెత్తుకొచ్చిన అంపైర్లు

Galeti Rajendra HT Telugu
Nov 09, 2024 09:05 AM IST

IND vs SA 1st T20 Fight: డేంజర్ జోన్‌లో ఎందుకు అడుగు పెడుతున్నావ్? అంటూ సంజు శాంసన్‌తో మార్కో జాన్సెన్‌ గొడవల మొదలుపెట్టగా.. సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగడంత వాగ్వాదం పీక్స్‌కి చేరిపోయింది.

మార్కో జాన్సెన్‌తో సూర్య గొడవ
మార్కో జాన్సెన్‌తో సూర్య గొడవ (X)

భారత్, దక్షిణాఫ్రికా మధ్య డర్బన్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గొడవైంది. సంజు శాంసన్‌పై తొలుత దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ నోరుజారగా.. వెంటనే రంగంలోకి దిగిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతనికి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరగడంతో ఫీల్డ్ అంపైర్లు పరుగెత్తుకొచ్చి శాంతిపజేశారు.

పిచ్ డేంజర్‌ జోన్‌‌‌తో మొదలైన గొడవ

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 202 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా టీమ్‌ 12 ఓవర్లు ముగిసే సమయానికి 87/5తో ఓటమిని ఖాయం చేసుకుంది. దాంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు సహనం కోల్పోయారు.

ఇన్నింగ్స్ 15 ఓవర్‌లో ఫీల్డర్ విసిరిన బంతిని అందుకునే క్రమంలో భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ పిచ్ డేంజర్ జోన్‌లో అడుగుపెట్టాడు. దాంతో దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్కో జాన్సెన్.. పిచ్ డేంజర్ జోన్‌లో ఎందుకు అడుగుపెడుతున్నావ్? అంటూ సంజు శాంసన్‌తో గొడవపడ్డాడు.

కంప్లైట్ చేసుకో..

సంజు శాంసన్‌‌తో జాన్సెన్ మాటల యుద్ధానికి దిగడంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగి.. ఏవైనా ఉంటే అంపైర్‌కి ఫిర్యాదు చేయాలి తప్ప ఇలా చేయడమేంటి? అంటూ వార్నింగ్ ఇచ్చాడు. సూర్య రావడంతో మరో ఎండ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా బ్యాటర్ గెరాల్డ్ కూడా అక్కడికి వచ్చాడు. దాంతో జాన్సెన్, గెరాల్డ్‌ ఇద్దరితో సూర్యకుమార్ యాదవ్ మాటకి మాట బదులిస్తూ వాగ్వాదానికి దిగాడు.

ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం పెరగడంతో ఫీల్డ్ అంపైర్లు పరుగెత్తుకొచ్చి.. సర్దిచెప్పారు. అయినప్పటికీ.. మ్యాచ్ ముగిసే వరకూ సూర్య కోసం చల్లారినట్లు లేదు. ఈ గొడవ జరిగిన కాసేపటికే జాన్సెన్‌‌ని రవి బిష్ణోయ్ ఔట్ చేయగా.. గెరాల్డ్‌ని సూర్యకుమార్ యాదవ్ రనౌట్ చేసి రివేంజ్ తీర్చుకున్నాడు.

కెప్టెన్‌ కాబట్టి తప్పలేదు

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇలా మ్యాచ్‌ల్లో గొడవ పడటం చాలా అరుదు. ప్రత్యర్థి ఆటగాళ్లు తనపై స్లెడ్జింగ్‌కి దిగినా.. నవ్వుతూ బ్యాట్‌తోనే సమాధానం చెప్తుంటాడు. కానీ.. ఇదే మ్యాచ్‌లో సెంచరీ బాదిన సంజు శాంసన్‌పై కావాలనే దక్షిణాఫ్రికా ప్లేయర్లు గొడవపెట్టుకోవడంతో.. సూర్య సహనం కోల్పోయాడు. ఒక కెప్టెన్‌గా ప్లేయర్‌కి అండగా నిలిచి తన బాధ్యతని నిర్వర్తించాడు.

ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు బాదేసి 107 పరుగులు చేశాడు. దాంతో భారత్ జట్టు 202 పరుగుల స్కోరుని నమోదు చేయగా.. ఛేదనలో తడబడిన దక్షిణాఫ్రికా టీమ్ 17.5 ఓవర్లలోనే 141 పరుగులకి ఆలౌటైంది. దాంతో నాలుగు టీ20ల సిరీస్‌లో భారత్ జట్టు 1-0తో ఆధిక్యాన్ని అందుకోగా.. ఇక రెండో టీ20 మ్యాచ్ ఆదివారం రాత్రి 7.30 గంటలకి జరగనుంది.

సూర్యకి శిక్ష పడుతుందా?

మ్యాచ్‌లో గొడవపై ఒకవేళ ఫీల్డ్ అంపైర్లు.. మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేస్తే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కి మందలింపు లేదా జరిమానా పడే అవకాశం ఉంది. అయితే.. ఒకవేళ అంపైర్లు ఫిర్యాదు చేయకపోతే సూర్యకుమార్ యాదవ్‌కి ఎలాంటి శిక్ష ఉండదు.

Whats_app_banner