Virat Kohli Retirement: బాంబ్ పేల్చిన కోహ్లి.. రిటైర్మెంట్ పై హింట్.. టీ20ల్లో యూ టర్న్
Virat Kohli Retirement: రిటైర్మెంట్ పై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బాంబ్ పేల్చాడు. త్వరలోనే ఆటకు వీడ్కోలు పలకబోతున్నాననే హింట్ ఇచ్చాడు. మరోసారి ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లకపోవచ్చని చెప్పాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బాంబ్ పేల్చాడు. రిటైర్మెంట్ హింట్ ఇచ్చేలా కామెంట్లు చేశాడు. తన కెరీర్ లో మరో ఆస్ట్రేలియా టూర్ ఉండకపోవచ్చని పేర్కొన్నాడు. గతేడాది చివర్లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన కింగ్ కోహ్లి.. ఐపీఎల్ 2025 సందర్బంగా ఆర్సీబీతో చేరాడు.
ఏం చేయాలో తెలియట్లేదు?
ఐపీఎల్ 2025 నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కోహ్లి కలిశాడు. శనివారం (మార్చి 15) ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ లో కోహ్లి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదని తెలిపాడు.
‘‘రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తానో నిజంగా తెలియదు. నా టీమ్ మేట్ ఒకరిని ఇదే ప్రశ్న అడిగితే ఇలాంటి సమాధానమే వచ్చింది. కానీ రిటైర్మెంట్ తర్వాత మాత్రం ఎక్కువగా ట్రావెల్ చేస్తానేమో’’ అని కోహ్లి చెప్పాడు.
ఆస్ట్రేలియాలో చివరిగా
గత ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయాడు. పెర్త్ టెస్టులో సెంచరీ చేసిన కింగ్.. ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అయ్యాడు. ఈ ప్రదర్శనపై మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో చివరి సిరీస్ ఆడేశాననే అర్థం వచ్చేలా కామెంట్లు చేశాడు.
‘‘మరో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్తానని అనుకోవడం లేదు. అందుకే గతంలో ఏం జరిగిందో పట్టించుకోను. ప్రశాంతంగా ఉంటా’’ అని కోహ్లి అన్నాడు. అంటే మరో ఆసీస్ టూర్ కంటే ముందే కోహ్లి రిటైర్మెంట్ ఆనౌన్స్ చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒలింపిక్స్ లో
టీ20ల్లో కోహ్లి యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చిన సంగతి తెలిసిందే. ఆ మెగా గేమ్స్ లో భారత్ ఫైనల్ చేరితే కోహ్లి టీ20 రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది.
‘‘ఒలింపిక్స్ లో క్రికెట్ భాగం కావడం మాకు మంచి అవకాశం. ఆ గేమ్స్ లో నుంచి మెడల్ తో వస్తే జట్టుకు ఎంతో బాగుంటుంది. ఒకవేళ 2028 ఒలింపిక్స్ క్రికెట్లో భారత్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ కోసం టీ20 రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చే అవకాశాన్ని ఆలోచిస్తా’’ అని కోహ్లి పేర్కొన్నాడు. 2024 టీ20 ప్రపంచప్ విజయం తర్వాత కోహ్లి టీ20లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
కండీషన్స్ ను మిగతా టీమ్స్ కంటే బెటర్ గా అర్థం చేసుకుని ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచామని 36 ఏళ్ల కోహ్లి అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్, కోహ్లి వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలొచ్చాయి. కానీ వీళ్లు కొనసాగుతామని చెప్పారు.
సంబంధిత కథనం