Ind vs Nep: ఆరు ఓవర్లలోనే మూడు క్యాచ్‌లు డ్రాప్.. మరీ ఇంత చెత్త ఫీల్డింగా?
Ind vs Nep: ఆరు ఓవర్లలోనే మూడు క్యాచ్‌లు డ్రాప్ చేశారు టీమిండియా ఫీల్డర్లు. నేపాల్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో పరువు తీసుకున్నారు. సూపర్ 4 చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది.
Ind vs Nep: ఆసియా కప్ 2023లో భాగంగా పసికూన నేపాల్ తో సోమవారం (సెప్టెంబర్ 4) మ్యాచ్ ఆడుతోంది ఇండియా. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే తొలి ఆరు ఓవర్లలోనే మూడు సులువైన క్యాచ్ లు నేలపాలు చేశారు మన ఫీల్డర్లు. అది చూసి అభిమానులు షాక్ తిన్నారు. మరీ ఇంత చెత్త ఫీల్డింగ్ చేయడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఇండియా తరఫున శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ లు క్యాచ్ లు డ్రాప్ చేశారు. తొలి ఓవర్లోనే వికెట్ తీసే అవకాశం ఇండియాకు దక్కింది. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ షమి వేసిన తొలి ఓవర్లో నేపాల్ బ్యాటర్ కుశల్ భూర్తల్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ డ్రాప్ చేశాడు.
ఇక రెండో ఓవర్లో విరాట్ కోహ్లి అదే పని చేశాడు. ఈసారి మరో నేపాల్ ఓపెనర్ ఆసిఫ్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను కోహ్లి అందుకోలేకపోయాడు. రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీసే అవకాశాన్ని టీమ్ కోల్పోయింది. ఇక ఐదో ఓవర్లో మరో క్యాచ్ డ్రాప్ అయింది. ఈసారి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వంతు అయింది. తొలి ఓవర్లో ఔటయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కిన కుశల్ కు మరో లైఫ్ దొరికింది.
సులువైన క్యాచ్ ను ఇషాన్ డ్రాప్ చేశాడు. వరుసగా ఇలా మూడు క్యాచ్ లు డ్రాప్ కావడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. కోహ్లి, శ్రేయస్ లాంటి స్టార్ ఫీల్డర్లు కూడా క్యాచ్ లు డ్రాప్ చేయడమేంటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో టీమ్ కు అసలు ఫీల్డింగ్ చేసే అవకాశమే దక్కలేదు. ఇండియా ఇన్నింగ్స్ ముగియగానే పడిన భారీ వర్షంతో మ్యాచ్ మళ్లీ ప్రారంభం కాలేదు.
ఇప్పుడు నేపాల్ తో మ్యాచ్ లో అందుకు టాస్ గెలవగానే రోహిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తమ బౌలర్లకు కాస్త మ్యాచ్ ప్రాక్టీస్ దక్కడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ చెప్పాడు.