టీమిండియా చరిత్ర.. ఇంగ్లాండ్ పై అద్భుత విజయం.. 58 ఏళ్లలో తొలి విక్టరీ.. అదరగొట్టిన ఆకాశ్ దీప్-india register first victory at birmingham in 58 years as team defeat england in second test akash deep fifer ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  టీమిండియా చరిత్ర.. ఇంగ్లాండ్ పై అద్భుత విజయం.. 58 ఏళ్లలో తొలి విక్టరీ.. అదరగొట్టిన ఆకాశ్ దీప్

టీమిండియా చరిత్ర.. ఇంగ్లాండ్ పై అద్భుత విజయం.. 58 ఏళ్లలో తొలి విక్టరీ.. అదరగొట్టిన ఆకాశ్ దీప్

టీమిండియా గెలిచింది. అలా ఇలా కాదు.. హిస్టరీ క్రియేట్ చేసేలా, కసితీరా రివేంజ్ తీర్చుకునేలా.. భారత్ విజయం సాధించింది. రెండో టెస్టులో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది.

ఆకాశ్ దీప్ ను అభినందిస్తున్న సహచర ఆటగాళ్లు (Action Images via Reuters)

58 ఏళ్లుగా బర్మింగ్ హమ్ కోటను బద్దలు కొట్టడానికి టీమిండియా దండయాత్ర చేస్తూనే ఉంది. అక్కడ ఇంగ్లాండ్ తో 8 టెస్టులాడింది. ఏడో ఓడింది. ఒక్కటి డ్రా చేసుకుంది. కానీ విజయం మాత్రం దక్కలేదు. దశాబ్దాలు గడిచాయి. అర్ధశతాబ్దం పూర్తయింది. కానీ నిరాశ తప్పలేదు. ఇప్పుడా నిరాశను దాటి భారత క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. బర్మింగ్ హమ్ లో తొలి టెస్టు విక్టరీ సాధించింది. అంతే కాకుండా పరుగుల పరంగా విదేశాల్లో అతిపెద్ద విజయాన్ని అందుకుంది.

ఇంగ్లాండ్ చిత్తు

రెండో టెస్టులో టీమిండియా గెలిచింది. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. ఆదివారం (జూలై 6) ముగిసిన మ్యాచ్ లో భారత్ 337 పరుగుల తేడాతో విజయం సాధించింది. 608 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ దీప్ టెస్టుల్లో తొలిసారి అయిదు వికెట్ల ఘనత సాధించాడు. అతను మొత్తం 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. జడేజా, సిరాజ్, ప్రసిద్ధ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఉత్కంఠ రేగి

ఇంగ్లాండ్ తో రెండో టెస్టు లో అయిదో రోజు ఉత్కంఠ రేగింది. వర్షం పడటంతో టెన్షన్ నెలకొంది. భారత్ గెలుపును వరుణుడు అడ్డుకుంటాడేమో అనిపించింది. కానీ వరుణుడు దారినిచ్చాడు. వర్షం ఆగిపోవడంతో ఆట స్టార్ట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 72/3తో ఇంగ్లాండ్ ఛేజింగ్ కొనసాగించింది. వర్షం ఆగిపోయాక మైదానంలో భారత బౌలర్ల వికెట్ల వేట కొనసాగింది.

ఆకాశ్ అదుర్స్

ఛేజింగ్ లో ఇంగ్లాండ్ ను చావుదెబ్బ కొట్టాడు ఆకాశ్ దీప్. కండీషన్స్ ను మంచిగా ఉపయోగించుకుని వికెట్లు పడగొట్టాడు. వరుస ఓవర్లలో ఒలీ పోప్, హ్యారీ బ్రూక్ ను ఔట్ చేసి భారత్ ను విజయం వైపు నడిపించాడు. కానీ ఆ దశలో జేమీ స్మిత్ (88), కెప్టెన్ స్టోక్స్ (33) పోరాడారు. వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఓ చక్కటి బంతితో స్టోక్స్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. క్రిస్ వోక్స్ ను ప్రసిద్ధ్ పెవిలియన్ చేర్చాడు.

ఓ వైపు జేమీ స్మిత్ మాత్రం ఫైటింగ్ కొనసాగించాడు. బ్రైడన్ కార్స్ (38) తో కలిసి ఇండియా విక్టరీని ఆలస్యం చేశాడు. కానీ మళ్లీ ఆకాశ్ దీప్ చెలరేగాడు. జేమీ స్మిత్ ను ఔట్ చేసి కీలక వికెట్ సాధించడమే కాకుండా.. అయిదు వికెట్ల ఘనత సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే జోష్ టంగ్ వికెట్ ను జడేజా దక్కించుకున్నాడు. కార్స్ ను ఔట్ చేసిన ఆకాశ్ దీప్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు ఎండ్ కార్డు వేశాడు.

రివేంజ్ విక్టరీ

ఫస్ట్ టెస్టులో గెలిచే ఛాన్స్ ను మిస్ చేసుకుంది ఇండియా. ఈ సారి మాత్రం అవకాశం వదల్లేదు. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌ అద్భుతమైన బ్యాటింగ్ తో సత్తాచాటాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేసింది. సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 407 పరుగులకు ఆలౌటైంది. సెకండ్ ఇన్నింగ్స్ లో గిల్ మరో సెంచరీ బాదాడు. టీమిండియా ఇన్నింగ్స్ ను 427/6 వద్ద డిక్లేర్ చేసింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం