IND vs ENG 5th Test: ఇంగ్లండ్‍తో చివరి టెస్టుకు భారత్ రెడీ.. పిచ్, వాతావరణం ఎలా ఉండొచ్చంటే..-india ready to take on england in 5th test dharamshala weather pitch report final xi ravichandran ashwin 100th test ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  India Ready To Take On England In 5th Test Dharamshala Weather Pitch Report Final Xi Ravichandran Ashwin 100th Test

IND vs ENG 5th Test: ఇంగ్లండ్‍తో చివరి టెస్టుకు భారత్ రెడీ.. పిచ్, వాతావరణం ఎలా ఉండొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 06, 2024 09:46 PM IST

India vs England Dharamshala Test: సిరీస్‍లో ఆఖరిదైన ఐదో టెస్టులో తలపడేందుకు ఇండియా, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. ఇప్పటికే సిరీస్ దక్కించుకున్న భారత్.. చివరి పోరులోనూ గెలిచి సత్తాచాటాలని పట్టుదలగా ఉంది. రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్‌స్టోలకు ఇది 100వ టెస్టుగా ఉండనుంది. ఈ మ్యాచ్ వివరాలివే..

IND vs ENG 5th Test: ఇంగ్లండ్‍తో చివరి టెస్టుకు భారత్ రెడీ.. పిచ్, వాతావరణం ఎలా ఉండొచ్చంటే..
IND vs ENG 5th Test: ఇంగ్లండ్‍తో చివరి టెస్టుకు భారత్ రెడీ.. పిచ్, వాతావరణం ఎలా ఉండొచ్చంటే.. (BCCI-X)

IND vs ENG 5th Test Match: స్వదేశంలో ఇంగ్లండ్‍తో ఆఖరి పోరుకు టీమిండియా సిద్ధమైంది. టీమిండియా, ఇంగ్లిష్ జట్టు మధ్య టెస్టు సిరీస్‍లో చివరిదైన ఐదో మ్యాచ్ గురువారం (మార్చి 7) షురూ కానుంది. హిమాలయాల మధ్య ఉండే ధర్మశాల స్టేడియంలో ఈ ఐదో టెస్టు జరగనుంది. ఇప్పటికే 3-1తో ఈ సిరీస్‍ను భారత్ కైవసం చేసుకుంది. ఈ ఐదో మ్యాచ్‍లోనూ ఫామ్ కొనసాగించి.. సత్తాచాటాలని రోహిత్ శర్మ సేన తహతహలాడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఐదు టెస్టుల సిరీస్‍లో హైదరాబాద్‍లో జరిగిన తొలి మ్యాచ్‍లో అనూహ్య ఓటమి ఎదురయ్యాక టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. విశాఖపట్నం టెస్టులో 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‍పై గెలిచింది. ఆ తర్వాత రాజ్‍కోట్ టెస్టులో ఏకంగా 434 రన్స్ తేడాతో విజయఢంకా మోగించి.. టెస్టు చరిత్రలో పరుగుల పరంగా తన అత్యంత భారీ విజయం నమోదు చేసుకుంది భారత్. రాంచీ టెస్టులో ఐదు వికెట్ల తేడాతో రోహిత్ సేన గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై వరుసగా 17వ టెస్టు సిరీస్ గెలిచి.. ఆధిపత్యం చూపింది. ధర్మశాలలో జరిగే ఐదో టెస్టులోనూ విజయం సాధించి.. టెస్టు చాంపియన్‍షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరమైనా ఈ సిరీస్‍లో భారత్ దుమ్మురేపింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు ద్విశతకాలతో అద్భుత బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్‍లోనే అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్.. రాంచీ టెస్టులో అదరగొట్టాడు. స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా, సిరాజ్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ కూడా సత్తాచాటుతున్నారు. ఐదో టెస్టులోనూ సమిష్టిగా అదరగొట్టాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది.

ధర్మశాల పిచ్ ఇలా..

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు జరిగే ధర్మశాల హెచ్‍పీసీఏ పిచ్‍పై పచ్చిక కాస్త ఎక్కువగానే ఉంది. సాధారణంగా ధర్మశాల పిచ్ పేస్‍కు ఎక్కువగా సహకరిస్తుంది. అయితే, ఈసారి పిచ్ కాస్త విభిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆరంభంలో పేసర్లకు కాస్త సహకారం లభించినా.. ఎక్కువ శాతం బ్యాటింగ్‍కే ఈ పిచ్ అనుకూలంగా ఉండనుందని తెలుస్తోంది. కొత్త బంతితో పేసర్లకు స్వింగ్ బాగానే లభించొచ్చు. మూడో రోజు నుంచి స్పిన్‍కు ఎక్కువగా ఈ పిచ్ నుంచి మద్దతు దొరికే ఛాన్స్ ఉంది. కాస్త స్లో పిచ్‍గానే ఉండనుందనే అంచనాలు ఉన్నాయి.

తీవ్రమైన చలి, వాన

హిమాలయ ప్రాంతమైన ధర్మశాలలో ప్రస్తుతం వాతావరణం చాలా చల్లగా ఉండనుంది. పొగ మంచు కురవనుంది. అలాగే, భారత్, ఇంగ్లండ్ ఐదో టెస్టు మొదలయ్యే మార్చి 7న కాస్త జల్లులు కూడా పడే అవకాశం ఉంది. ఆటకు అంతరాయం కలిగే ఛాన్స్ కూడా ఉందని అంచనాలు ఉన్నాయి.

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు గురువారం (మార్చి 7) మొదలుకానుంది. ప్రతీ రోజు ఆట ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. స్పోర్ట్స్ 18 టీవీ ఛానెల్, జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ వస్తుంది.

ఇద్దరికి వందో టెస్టు

భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍కు ఇది 100వ టెస్టుగా ఉంది. 100 టెస్టుల ఘనత దక్కించుకున్న 14వ భారత ప్లేయర్‌గా అశ్విన్ నిలవనున్నాడు. ఇటీవలే 500 టెస్టు వికెట్ల మార్క్ దాటిన అశ్విన్.. మరో మైలురాయి చేరనున్నాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోకు కూడా ఇది 100వ టెస్టుగా ఉండనుంది.

తుది జట్లు ఇలా..

ఐదో టెస్టుకు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్, రజత్ పాటిదార్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, అశ్విన్, కుల్దీప్ యాదవ్/ ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, జస్‍ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్

IPL_Entry_Point