Team India: ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు ముంగిట.. భారత్ జట్టుకి ఉత్సాహానిచ్చే రికార్డ్స్
India Pink Ball Test Record: భారత్ జట్టు ఇప్పటి వరకూ ఐదు డే/నైట్ టెస్టులు ఆడింది. కానీ.. ఇందులో ఆస్ట్రేలియాతో ఆడిన టెస్టు మ్యాచ్ చరిత్రలోనే అత్యంత అవమానరకర చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో మళ్లీ డే/నైట్ టెస్టుని టీమిండియా ఆడబోతుండగా..?
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ మైదానం వేదికగా డిసెంబర్ 6 (శుక్రవారం) నుంచి పింక్ బాల్‌తో డే/నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న రెండో టెస్టు ఇదికాగా.. పెర్త్ వేదికగా ఇటీవల జరిగిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో విజయం సాధించింది.
నాలుగు ఆడిన.. మూడింట విజయం
ఆస్ట్రేలియాలో ఇప్పటికే ఒక డే/నైట్ టెస్టు మ్యాచ్ ఆడిన భారత్ జట్టుకి మరిచిపోలేని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. భారత జట్టు ఇప్పటి వరకు మొత్తం నాలుగు డే/నైట్ టెస్టు మ్యాచ్‌లను ఆడగా.. ఇందులో ఒకటి మాత్రమే ఓడిపోయింది. అది ఆస్ట్రేలియా చేతిలోనే కావడం గమనార్హం. ఇక మిగిలిన మూడింటిలో విజయం సాధించింది. కానీ.. 2022 నుంచి భారత్ జట్టు డే/నైట్ టెస్టు మ్యాచ్ ఆడలేదు.
విరాట్ కోహ్లీ రికార్డ్
భారత్ తరఫున డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఏకైక భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ. 2019 నవంబర్ 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే/నైట్ టెస్టులో విరాట్ కోహ్లీ 136 పరుగులు చేయగా.. ఆ మ్యాచ్‌లో భారత్ జట్టు ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రెండు సార్లు 300 ప్లస్ స్కోర్లు
2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో భారత్ 347/9తో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. డే/నైట్ టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో భారత్‌కి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. డే నైట్ టెస్టుల్లో భారత్ రెండుసార్లు 300కు పైగా పరుగులు చేయగలిగింది. 2019లో ఒకసారి, 2022లో ఒకసారి.. 2022 మార్చిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
మూడేళ్ల క్రితం చేదు అనుభవం
డే/నైట్ టెస్టులో భారత్ జట్టు అత్యల్ప స్కోరు 36 పరుగులు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి మ్యాచ్. ఆ మ్యాచ్‌లో టీమిండియా అవమానకరంగా ఓడిపోయింది. కానీ.. సిరీస్‌లో మిగిలిన మూడు టెస్టులలో రెండింటిని గెలిచి, ఒక టెస్టుని డ్రాగా ముగించి సిరీస్‌ను చేజిక్కించుకుంది.
అక్షర్ టాప్ రికార్డ్
భారత్ తరఫున నాలుగు డే/నైట్ టెస్టులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్.. డే/నైట్ టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అశ్విన్ మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు. అయితే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డ్ మాత్రం అక్షర్ పటేల్ పేరిట ఉంది. అక్షర్ పటేల్ 38 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన అక్షర్.. పింక్ బాల్ టెస్టులో 11 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు.