IND vs SA 3rd T20: టీమిండియాలో టెన్షన్ పెంచుతున్న సెంచూరియన్ రికార్డ్, దక్షిణాఫ్రికా టీమ్ మాస్టర్ ప్లాన్
India vs South Africa 3rd T20: ఫస్ట్ టీ20లో బ్యాటింగ్‌లో అదరగొట్టేసిన టీమిండియా.. రెండో టీ20లో తేలిపోయింది. దానికి కారణం గెబేహా పిచ్. ఇప్పుడు మూడో టీ20 సెంచూరియన్ ఆతిథ్యం ఇవ్వబోతుండగా.. ఈ స్టేడియంలో భారత్ ఆడింది ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే.
దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టీ20లో గెలిచిన భారత్ జట్టు.. రెండో టీ20లో అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. బ్యాటింగ్‌కి అనుకూలించిన డర్బన్ టీ20లో 202 పరుగులు చేసిన టీమిండియా.. గెబేహా టీ20లో కేవలం 124 పరుగులే చేయగలిగింది. ఇక మూడో టీ20 మ్యాచ్ సెంచూరియన్ వేదికగా బుధవారం రాత్రి జరగనుండగా.. గెబేహా తరహాలోనే ఈ పిచ్‌ను దక్షిణాఫ్రికా సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హార్దిక్ పాండ్యా ఒక్కడే
2009 నుంచి భారత్ జట్టు ఆ సెంచూరియన్ మైదానంలో కేవలం ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడింది. 2018లో జరిగిన ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 6 వికెట్ల తేడాతో భారత్ జట్టు పరాజయాన్ని చవిచూసింది. అప్పట్లో ఆ టీ20 మ్యాచ్ ఆడిన భారత్ ప్లేయర్లలో కేవలం హార్దిక్ పాండ్యా మాత్రమే ఇప్పుడు టీమ్‌లో ఉన్నాడు. మిగిలిన ఆటగాళ్లంతా కొత్తవారే.
వాస్తవానికి సెంచూరియన్ పిచ్ సహజసిద్ధంగా పేసర్లకి అనుకూలిస్తుంది. బౌన్స్, వేగంతో బ్యాటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే.. ఈ పిచ్‌లు దక్షిణాఫ్రికా టీమ్‌కి అలవాటే. కానీ.. భారత్ ఆటగాళ్లు అలవాటు పడాలంటే కాసేపు క్రీజులో నిలబడాలి.
దూకుడు ఓకే.. కానీ?
కానీ.. గత కొంతకాలంగా దూకుడు మంత్రాన్ని జపిస్తున్న టీమిండియా బ్యాటర్లు మొదటి నుంచి బంతిని బలంగా హిట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. గెబేహా టీ20లోనూ అలా ఆడబోయి.. ఒకానొక దశలో 45/4తో నిలిచిన టీమ్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. మరి సెంచూరియన్ పిచ్‌పై ఎలా ఆడతారో చూడాలి. భారత్ బ్యాటింగ్ స్టయిల్ తెలిసే.. గెబేహా టైప్ పిచ్‌ను సెంచూరియన్‌లోనూ సఫారీలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తొలి టీ20లో భారత్ జట్టు 61 పరుగుల తేడాతో విజయం సాధించగా.. దక్షిణాఫ్రికా టీమ్ రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో నాలుగు టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఈ నేపథ్యంలో.. మూడో టీ20 మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
భారత్ టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకు సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా. అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాక్, అవేష్ ఖాన్, యశ్ దయాళ్.
దక్షిణాఫ్రికా టీ20 జట్టు
ఐడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్మన్, గెరాల్డ్ కోట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్. హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్. కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్. ఆండిల్ సిమెలేన్. లూథో సిపామ్లా, ట్రిస్టాన్ స్టబ్స్.
మూడో టీ20లో భారత్ గెలవాలంటే?
భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ బుధవారం రాత్రి 8.30 గంటలకు సెంచూరియన్ వేదికగా ప్రారంభంకానుంది. మ్యాచ్‌కి అరగంట ముందు టాస్ పడనుంది. తొలి రెండు టీ20ల్లోనూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయాడు. దాంతో.. భారత్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. సెంచూరియన్ పిచ్ కూడా ఛేదనకు అనుకూలం.. కాబట్టి ఒకవేళ టాస్ ఓడి మళ్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే భారత్ జట్టు కనీసం 180-200 పరుగులైనా బోర్డుపై ఉంచాలి.