IND vs AUS: ఆఖరి ఆట భారత్‍దే.. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియాపై విజయం
IND vs AUS 5th T20I: ఐదో టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. గెలుపుతో సిరీస్ ముగించింది భారత్.
IND vs AUS 5th T20I: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍ను గెలుపుతో ఘనంగా ముగించింది టీమిండియా. ఉత్కంఠ మధ్య బెంగళూరులో నేడు (డిసెంబర్ 3) జరిగిన ఐదో టీ20లో భారత్ విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా 4-1తో ఈ సిరీస్‍ను కైవసం చేసుకుంది. ఐదు టీ20ల సిరీస్‍లో చివరిదైన ఐదో మ్యాచ్‍లో నేడు భారత్ 6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. చివరి ఓవర్లో గెలుపు కోసం ఆసీస్ 10 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత పేసర్ అర్షదీప్ మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. దీంతో భారత్ గెలిచింది.
161 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా చివరి వరకు పోరాడి పరాజయం పాలైంది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది ఆసీస్. ఆస్ట్రేలియా బ్యాటర్ బెన్ మెక్‍డెర్మోట్ (54) అర్ధ శతకం చేయగా.. కెప్టెన్ మాథ్యూ వేడ్ (22) చివర్లో అద్భుతంగా పోడాడు. భారత బౌలర్లలో పేసర్ ముకేశ్ కుమార్ మూడు వికెట్లతో రాణించాడు. అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ చెరో రెండు, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీసుకున్నారు. ఉత్కంఠ మధ్య ఎట్టకేలకు భారత్ గెలిచింది. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీసి ఆకట్టుకున్నాడు భారత స్పిన్నర్ అక్షర్ పటేల్. బ్యాటింగ్‍లోనూ 31 రన్స్ చేశాడు. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్ (53) అర్ధ శతకం చేయడం సహా అక్షర్ పటేల్ (31), జితేశ్ శర్మ (24) రాణించడంతో టీమిండియాకు పోరాడే స్కోరు లభించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బెహరండాఫ్, డార్షుస్ చెరో రెండు, హార్డీ, ఎలిస్, తన్వీర్ సంఘా చెరో వికెట్ తీసుకున్నారు.
ఐదో టీ20లో గెలుపుతో 4-1తో సిరీస్‍ను భారత్ కైవసం చేసుకుంది. వన్డే ప్రపంచకప్ ఆడిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా మంది సీనియర్ ప్లేయర్లు ఈ సిరీస్‍కు విశ్రాంతి తీసుకున్నారు. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టుకు ఆసీస్‍తో ఈ సిరీస్‍లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించాడు. కెప్టెన్‍గా తొలి సిరీస్‍లోనే టీమిండియాను విజయపథంలో నడిపాడు.
టీమిండియా తదుపరి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‍లు ఆడనుంది. డిసెంబర్ 10వ తేదీన భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. డిసెంబర్ 17 నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. డిసెంబర్ 26న టెస్టు సిరీస్ మొదలవుతుంది.