ఆసియా కప్ 2025 ఫైనల్.. అది కూడాా దాయాది పాకిస్థాన్ తో పోరు.. అప్పటికే ఈ టోర్నీలో రెండు సార్లు పాక్ ను చిత్తుచేసింది ఇండియా. కానీ టైటిల్ సమరంలో బ్యాటింగ్, బౌలింగ్ లో ఫస్ట్ పాక్ డామినెన్స్ చూపించింది. కానీ టీమిండియా అంటే ఏంటో మరోసారి పాక్ కు అర్థమయ్యేలా అద్భుతంగా పోరాడిన భారత్ విజేతగా నిలిచింది. రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి ఆసియా కప్ ను ముద్దాడింది.
ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థిని ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఆ టీమ్ లో సాహిబ్జాదా (57) టాప్ స్కోరర్. కుల్ దీప్ నాలుగు వికెట్లు తీశాడు. ఛేజింగ్ లో తిలక్ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అమేజింగ్ ఫైటింగ్ తో ఇండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది. అభిషేక్ వికెట్
ఆసియా కప్ 2025లో సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ (5) ఫైనల్లో మాత్రం ఫెయిలయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అష్రఫ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) కూడా ఔట్ అయ్యాడు. శుభ్ మన్ గిల్ (12) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. దీంతో ఇండియా 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాను గెలిపించడానికి హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ గొప్పగా పోరాడాడు. ముందు సంజు శాంసన్ (24) తో కలిసి తిలక్ ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే స్కోరుబోర్డు నెమ్మదిగా సాగిపోయింది. టీమ్ స్కోరు 77 పరుగుల వద్ద శాంసన్ ఔటైపోయాడు.
ఇండియా 14 ఓవర్లకు 83/4తో నిలిచింది. టీమ్ గెలవాలంటే 36 బంతుల్లో 64 పరుగులు చేయాలి. ఆ దశలో తిలక్, శివమ్ దూబె (33) గేర్ మార్చాలని చూశారు. హారిస్ రవూఫ్ వేసిన 15వ ఓవర్లో తిలక్ ఓ ఫోర్, సిక్సర్.. దూబె ఓ ఫోర్ కొట్టడంతో 17 పరుగులొచ్చాయి. ఆ తర్వాత కూడా ఈ జోడీ దంచుడు కొనసాగించింది. కానీ 17వ ఓవర్లో 6 పరుగులే ఇచ్చాడు షహీన్ అఫ్రిది.
లాస్ట్ 3 ఓవర్లలో 30 పరుగులు కావాల్సిన పరిస్థితి. 18వ ఓవర్లో దూబె ఓ సిక్సర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. సమీకరణం 12 బంతుల్లో 17 పరుగులుగా మారింది. కానీ 19వ ఓవర్లో దూబె ఔటైపోయాడు.
ఇండియా విన్నింగ్ ఈక్వెషన్ 6 బాల్స్ లో 10 రన్స్ గా మారడంతో తీవ్ర ఉత్కంఠ రేగింది. అందరిలోనూ టెన్షన్. ఫస్ట్ బాల్ కు తిలక్ రెండు పరుగులు తీశాడు. టీమ్ ను గెలిపించేంత వరకూ పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడిన తిలక్ వర్మ రెండో బాల్ కు సిక్సర్ కొట్టాడు. మూడో బంతికిి సింగిల్ వచ్చింది. ఇండియా గెలవాలంటే ఒక్క రన్ మాత్రమే కావాలి. రింకు సింగ్ ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది పాకిస్థాన్. ఆ జట్టు ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫకర్ జమాన్ (35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జోరు చూస్తే ఆ టీమ్ అలవోకగా 200 స్కోరు చేసేలా కనిపించింది. కానీ చివరకు 150 రన్స్ కూడా చేయలేకపోయింది. అందుకు ప్రధాన కారణం స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్. అతనికి అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా జోరు కూడా తోడైంది.
సాహిబ్జాదా, ఫకర్ చెలరేగడంతో పాక్ 9.3 ఓవర్లు 84/0తో నిలిచింది. కానీ ఆ తర్వాతి బంతికే సాహిబ్జాదాను ఔట్ చేసిన వరుణ్ భారత్ కు ఫస్ట్ వికెట్ అందించాడు. సయీమ్ (14)ను కుల్ దీప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అక్షర్, బుమ్రా, వరుణ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కుల్ దీప్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
సంబంధిత కథనం