India vs england 2nd odi: రోహిత్ సెంచరీ.. ఇండియా విక్టరీ.. 305 టార్గెట్ ఉఫ్.. సిరీస్ సొంతం
India vs England 2nd odi: భారత క్రికెట్ జట్టు అదరగొట్టింది. కటక్ లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ పై గెలిచింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ అద్భుతమైన సెంచరీ సాధించాడు.

అదిరే విజయం
కటక్ లో ఆదివారం (ఫిబ్రవరి 9) ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా అదరగొట్టింది. 305 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసింది. 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఛేదనలో 6 వికెట్లు కోల్పోయి 44.3 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరో వన్డే మిగిలి ఉండగానే 2-0 తో భారత్ సొంతం చేసుకుంది. రోహిత్ (119) తిరిగి ఫామ్ అందుకుంటూ ఫెంటాస్టిక్ హండ్రెడ్ తో జట్టు ను గెలిపించాడు.
రోహిత్ సెంచరీ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. దాదాపు 16 నెలల తర్వాత వన్డేల్లో సెంచరీ అందుకున్నాడు. ఛేజింగ్ లో అతను 90 బంతుల్లోనే 119 పరుగులు చేశాడు. ధనాధన్ షాట్లతో చెలరేగాడు. 7 సిక్సర్లు బాదాడు. శుభ్ మన్ గిల్ (60), శ్రేయస్ అయ్యర్ (44) , అక్షర్ (41 నాటౌట్) కూడా బ్యాటింగ్ లో మెరిశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఒవర్టన్ (2/27) రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ భారీ స్కోరు
అంతకుముందు ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. రూట్ (69), డకెట్ (65) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. లివింగ్ స్టన్ (41) కూడా రాణించాడు. భారత బౌలర్లలో జడేజా (3/35) మూడు వికెట్లతో రాణించాడు. మధ్యలో భారత్ వికెట్లు పడగొట్టినా.. బ్యాటర్ల సమష్టి ప్రదర్శనతో ఇంగ్లండ్ స్కోరు 300 దాటింది. షమి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.
సిరీస్ సొంతం
రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. తొలి వన్డేలో నూ భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. సిరీస్ లో చివరిదైన మూడో వన్డే బుధవారం (ఫిబ్రవరి 12) జరుగుతుంది.
సంబంధిత కథనం