ముక్కోణపు సిరీస్ టైటిల్ భారత్‍దే.. ఫైనల్‍లో లంకను చిత్తుచేసిన టీమిండియా-india beats sri lanka in final lifts odi tri series title smriti mandhana sneh rana shines ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ముక్కోణపు సిరీస్ టైటిల్ భారత్‍దే.. ఫైనల్‍లో లంకను చిత్తుచేసిన టీమిండియా

ముక్కోణపు సిరీస్ టైటిల్ భారత్‍దే.. ఫైనల్‍లో లంకను చిత్తుచేసిన టీమిండియా

వన్డే ముక్కోణపు సిరీస్‍ ఫైనల్‍లో భారత్ ఆల్‍రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తుదిపోరులో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. బ్యాటింగ్‍లో స్మృతి మంధాన, బౌలింగ్‍లో స్నేహ్ రాణా సత్తాచాటారు.

ముక్కోణపు సిరీస్ టైటిల్ భారత్‍దే.. ఫైనల్‍లో లంకను చిత్తుచేసిన టీమిండియా

శ్రీలంక గడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‍లో భారత మహిళల జట్టు సత్తాచాటింది. లంక, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన ఈ సిరీస్ టైటిల్‍ను టీమిండియా సొంతం చేసుకుంది. ఈ ముక్కోణపు సిరీస్ ఫైనల్‍లో నేడు (మే 11) శ్రీలంకపై భారత్ 97 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కొలంబో వేదికగా జరిగిన పోరులో ఆల్‍రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపి టైటిల్ కైవసం చేసుకుంది హర్మన్‍ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళ టీమ్. ఫైనల్ ఎలా సాగిందంటే..

శతకంతో స్మృతి విజృంభణ

ఫైనల్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన టీమిండియా దుమ్మురేపింది. 50 ఓవర్లలో 7 వికెట్లకు 342 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 101 బంతుల్లోనే 116 పరుగులతో ధనాధన్ బ్యాటింగ్ చేశారు. సెంచరీతో అదరగొట్టారు. ఏకంగా 15 ఫోర్లు బాదిన స్మృతి.. రెండు సిక్స్‌లు కొట్టారు. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (30) కాసేపు నిలిచి ఔటయ్యారు.

పరుగులు పెట్టిన స్కోరు

ఆరంభం నుంచి స్మృతి మంధాన జోరు కొనసాగించారు. హిట్టింగ్ చేశారు. హర్లీన్ డియోల్ (47) నిలకడగా ఆడారు. ఈ క్రమంలో 92 బంతుల్లోనే సెంచరీ చేరారు స్మృతి. ఆ తర్వాత 33వ ఓవర్లో ఔటయ్యారు. హర్లీన్ కూడా కాసేపటికే వెనుదిరిగారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 41 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 44) రన్స్ ధనాధన్ హిట్టింగ్ చేశారు. దీంతో భారత్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. హర్మన్ ఔటైనా రోడ్రిగ్స్ దుమ్మురేపారు. దీంతో 46వ ఓవర్లోనే 300 మార్క్ దాటింది టీమిండియా.

రోడ్రిగ్స్ పెవిలియన్ చేరాక.. అమన్‍జోత్ కౌర్ (18), దీప్తి శర్మ (14 బంతుల్లో 20 పరుగులు) వేగంగానే ఆడారు. మొత్తంగా 342 పరుగుల భారీ స్కోరు చేసింది భారత్. శ్రీలంక బౌలర్లలో మల్కి మందారా, దేవ్మి విహంగ, సుగంధిక కుమార్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. రణవీరకు ఓ వికెట్ దక్కింది.

రెచ్చిపోయిన అమన్‍జోత్, రాణా

భారీ లక్ష్యఛేదనలో శ్రీలంక కుప్పకూలిపోయింది. భారత బౌలర్లు స్నేహ్ రాణా, అమన్‍జోత్ కౌర్ దెబ్బకు విలవిల్లాడింది. 48.2 ఓవర్లలో 245 పరుగులకే లంక ఔటైంది. స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో అదరగొడితే.. అమన్‍జోత్ మూడు వికెట్లు తీసుకొని సత్తాచాటారు. తొలి ఓవర్లోనే లంక ఓపెనర్ హాసిని పెరీరా (0)ను అమన్ డకౌట్ చేశారు.

లంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు (51) అర్ధ శతకం చేయగా.. నీలాక్షిక సిల్వ (48), విష్మి గుణరత్నే (36) మోస్తరుగా రాణించారు. అయితే, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. అమన్‍జోత్ కౌర్, స్నేహ్ వరుసగా వికెట్లు తీసి దెబ్బకొట్టారు. మొత్తంగా లంక పూర్తి ఓవర్లు కూడా ఆడలేక 10 బంతులు మిగిలి ఉండగానే ఆలౌటైంది. భారత్‍కు భారీ విజయం దక్కింది.

ముక్కోణపు సిరీస్ టైటిల్‍ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్‍లో శకతంతో దుమ్మురేపిన స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్‍లో 15 వికెట్లు తీసుకున్న స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతమైంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం