SA vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ ఫైట్.. సెమీస్‍లో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా-india and australia set to fight for title in cricket world cup 2023 final as south africa defeat in second semi final ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sa Vs Aus: భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ ఫైట్.. సెమీస్‍లో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా

SA vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ ఫైట్.. సెమీస్‍లో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా

SA vs AUS ICC World Cup 2023 Semi Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‍లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. నేడు రెండో సెమీఫైనల్‍లో దక్షిణాఫ్రికాను ఓడించిన ఆసీస్ తుదిపోరుకు చేరింది. సఫారీ జట్టుకు మరోసారి నిరాశ ఎదురైంది.

SA vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ ఫైట్.. సెమీస్‍లో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా (Hindustan Times)

SA vs AUS ICC World Cup 2023 Semi Final: వన్డే ప్రపంచకప్ 2023 టైటిల్ కోసం ఫైనల్‍లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. నేడు (నవంబర్ 16) జరిగిన వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్‍లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడి ఓడింది. సెమీ ఫైనల్ గండాన్ని మరోసారి దాటలేక నిరాశకు గురైంది. ఈ సెమీస్‍లో గెలిచిన ఆస్ట్రేలియా.. నవంబర్ 19న భారత్‍తో ప్రపంచకప్ ఫైనల్‍కు అర్హత సాధించింది. వివరాలివే..

213 పరుగుల లక్ష్యాన్ని చెమటోడ్చి ఛేదించింది ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా. 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసి ఆసీస్ గెలిచింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (62) అర్ధ శతకంతో రాణించగా.. స్టీవ్ స్మిత్ (30) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో జోస్ ఇంగ్లిస్ (28), మిచెల్ స్టార్క్ (16 నాటౌట్) ఆకట్టుకున్నారు. కాపాడుకోవాల్సిన స్కోరు తక్కువే ఉన్నా దక్షిణాఫ్రికా చివరి వరకు అద్భుతంగా పోరాడింది. అయితే, ఆస్ట్రేలియాను విజయం వరించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ, తబ్రైజ్ షంషి చెరో రెండు వికెట్లు తీయగా.. రబాడ, మార్క్‌రమ్, మహారాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఈ సెమీస్ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (101) సెంచరీతో ఒంటరి పోరు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ (47) అతడికి కాసేపు సహకరించగా.. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో సఫారీ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు. హాజిల్‍వుడ్, ట్రావిస్ హెడ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఆస్ట్రేలియా ఓ దశలో 137 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేసి ఆసీస్‍ను ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ప్రశాంతంగా ఆడడంతో ఆసీస్ గెలిచింది.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికాకు సెమీస్‍ ఫైనల్‍లో ఎదురుదెబ్బ తగలడం ఇది ఐదోసారి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ ఫైనల్ చేరలేకపోయింది ఆ జట్టు. అలాగే, వన్డే వరల్డ్ కప్ సెమీస్‍లో ఆస్ట్రేలియా చేతిలో ఓడడం దక్షిణాఫ్రికాకు ఇది మూడోసారి.

భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నవంబర్ 19న జరగనుంది. టీమిండియా, ఆసీస్.. 20 సంవత్సరాల తర్వాత వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో తలపడనున్నాయి. 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‍లో టీమిండియాపై గెలిచిన ఆస్ట్రేలియా టైటిల్ కొట్టింది. అయితే, సొంతగడ్డపై ఈసారి భారత్ గెలిచి, ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంటుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంగా ఉన్నారు . ఈ టోర్నీలో ఇప్పటి వరకు అజేయంగా ఉన్న టీమిండియా.. ఫైనల్‍లోనూ సత్తాచాటి మూడో వన్డే ప్రపంచకప్ టైటిల్ దక్కించుకుంటుందని కొండంత ఆశలు పెట్టుకున్నారు.