India all out: ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టులో తక్కువ స్కోరుకే భారత్ ఆలౌట్.. టాప్ స్కోరర్‌గా తెలుగు క్రికెటర్-india all out for 180 at dinner on opening day of pink ball test against australia ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India All Out: ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టులో తక్కువ స్కోరుకే భారత్ ఆలౌట్.. టాప్ స్కోరర్‌గా తెలుగు క్రికెటర్

India all out: ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టులో తక్కువ స్కోరుకే భారత్ ఆలౌట్.. టాప్ స్కోరర్‌గా తెలుగు క్రికెటర్

Galeti Rajendra HT Telugu
Dec 06, 2024 03:08 PM IST

India all out vs Australia: ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్టులో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచింది. బ్యాటర్లు చేతులెత్తేయడంతో.. తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు.

డే/నైట్ టెస్టులో భారత్ ఆలౌట్
డే/నైట్ టెస్టులో భారత్ ఆలౌట్ (AFP)

ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ జట్టు తక్కువ స్కోరుకే ఆలౌటైంది. డే/నైట్ టెస్టు ఫార్మాట్‌లో పింక్ బాల్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టు 44.1 ఓవర్లలోనే 180 పరుగులకి కుప్పకూలిపోయింది.

yearly horoscope entry point

6 వికెట్లు పడగొట్టిన స్టార్క్

టీమ్‌లో తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించగా.. పాట్ కమిన్స్, బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు.

కెరీర్‌లో తొలిసారి పింక్ బాల్‌తో టెస్టు ఆడిన యశస్వి జైశ్వాల్ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవకుండానే డకౌటవగా.. కేఎల్ రాహుల్ (31), శుభమన్ గిల్ (31) కాసేపు నిలకడగా ఆడారు. ఈ జంట రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

కోహ్లీ, రోహిత్ ఫెయిల్

కానీ.. ఈ ఇద్దరూ 12 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్‌కి చేరిపోగా.. విరాట్ కోహ్లీ (7), రోహిత్ శర్మ (3) కూడా తక్కువ స్కోరుకే ఔటైపోయారు. ఆదుకుంటాడని ఆశించిన రిషబ్ పంత్ (21) కూడా చేతులెత్తేయడంతో.. భారత్ జట్టు 150 పరుగులైనా చేస్తుందా? అనిపించింది.

పరువు నిలిపిన వైజాగ్ కుర్రాడు

ఈ దశలో విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 42 పరుగులు చేశాడు. అతనికి రవిచంద్రన్ అశ్విన్ (22) కాసేపు సహకారం అందించాడు. అశ్విన్ ఔట్ తర్వాత హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా జీరోకే వరుసగా ఔటైపోగా.. ఆఖర్లో సిరాజ్ (4) ఒక బౌండరీ మాత్రమే కొట్టగలిగాడు. నితీశ్ రెడ్డి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.

సిరీస్‌లో ఆధిక్యంలో భారత్

ఆస్ట్రేలియాతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులను అక్కడ భారత్ జట్టు ఆడుతోంది. ఇప్పటికే పెర్త్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. ప్రస్తుతం సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Whats_app_banner