IND vs SL 3rd ODI: సెంచరీ మిస్ చేసుకున్న అవిష్క.. అరంగేట్రంలో బంతితో అదరగొట్టిన పరాగ్.. టీమిండియాకు దీటైన టార్గెట్
IND vs SL 3rd ODI: మూడో వన్డేలో శ్రీలంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో దుమ్మురేపాడు. అయితే, కాస్తలో శతకం మిస్ చేసుకున్నారు. వన్డే అరంగేట్రం చేసిన భారత ఆటగాడు రియాన్ పరాగ్ బంతితో రాణించాడు. టీమిండియాకు టార్గెట్ ఎంతంటే..
శ్రీలంకతో నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో బౌలింగ్‍లో రాణించింది టీమిండియా. తొలుత ధీటుగా ఆడిన లంక.. ఆ తర్వాత జోరు కొనసాగించలేకపోయింది. దీంతో మోస్తరు స్కోరుకే పరిమితమైంది. మూడో వన్డేల సిరీస్ సమం చేసుకోవాలంటే ఈ చివరి మ్యాచ్‍లో భారత్ గెలువాల్సిందే. కొలంబోలో నేడు (ఆగస్టు 7) జరుగుతున్న మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఈ సిరీస్‍లో అత్యధిక స్కోరు చేసి భారత్‍కు దీటైన టార్గెట్ ఇచ్చింది లంక.
పరాగ్ అరంగేట్రం.. మూడు వికెట్లతో సత్తా
గత నెల జింబాబ్వే పర్యటనలో భారత్ తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్.. ఇప్పుడు వన్డే జట్టులోకి వచ్చేశాడు. ఈ మ్యాచ్‍తో వన్డే డెబ్యూట్ చేశాడు. తన తొలి వన్డేలోనే రియాన్ బంతితో అదరగొట్టాడు. 9 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కీలకమైన అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, దునిత్ వెల్లలాగే వికెట్లను పరాగ్ కైవసం చేసుకున్నాడు. ఈ నిర్ణయాత్మక మూడో వన్డేకు తుదిజట్టులో రెండు మార్పులు చేసింది భారత్. కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్, అర్షదీప్ సింగ్ ప్లేస్‍లో రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చారు.
దుమ్మురేపిన అవిష్క.. శతకం మిస్
ఈ మ్యాచ్‍లోనూ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (102 బంతుల్లో 96 పరుగులు; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టగా.. పాతుమ్ నిస్సంక (65 బంతుల్లో 45 పరుగులు) రాణించాడు. ఆ ఇద్దరూ లంకకు మంచి ఆరంభాన్ని అందించారు. వికెట్లు తీసే అవకాశాన్ని భారత బౌలర్లకు ఇవ్వకుండా పరుగులు రాబట్టారు. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ 20వ ఓవర్లో పాతుమ్ నిస్సంకను ఔట్ చేశాడు. దీంతో తొలి వికెట్ 89 పరుగుల వద్ద లంక కోల్పోయింది. అవిష్క ఫెర్నాండో మాత్రం అదే దూకుడు కొనసాగించాడు.
అవిష్కకు తోడైన కుషాల్ మెండిస్ కూాడా ఆరంభంలో జోరుగా ఆడాడు. దీంతో లంక స్కోరు బోర్డు వేగంగా ముందుకు సాగింది. దీంతో 31 ఓవర్లలో 150 పరుగులు చేసింది లంక. పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, రియాన్ పరాగ్ 36వ ఓవర్లో అవిష్క ఫెర్నాండోను ఎల్‍బీడబ్ల్యూ చేశాడు. దీంతో 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటై 4 రన్స్ దూరంలో శతకం మిస్ చేసుకున్నాడు అవిష్క.
చివర్లో తడబడిన లంక.. నిలిచిన కుషాల్
అవిష్క ఔటయ్యాక లంక కష్టాల్లో పడింది. లంక కెప్టెన్ చరిత్ అసలంక (10)ను పరాగ్ ఔట్ చేయగా.. సదీర్ సమరవిక్రమ (0)ను సిరాజ్ డకౌట్ చేశాడు. జనిత్ లియనాగే (8), గత రెండు మ్యాచ్‍ల హీరో దునిత్ వెల్లలాగే (2) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. దీంతో 199 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో చిక్కుకుంది. 28 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే, కుషాల్ మెండిస్ మాత్రం నిలకడగా ఆడాడు. 82 బంతుల్లో 59 పరుగులు (4 ఫోర్లు) చేసి లంక కుప్పకూలకుండా అడ్డుకున్నాడు. 49వ ఓవర్లో ఔటయ్యాడు. మొత్తంగా 248 రన్స్ చేసింది లంక. టీమిండియా బౌలర్లు చివరి 15 ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులు వేశారు. వరుసగా వికెట్లు తీయటంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు.
భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లతో మెరిశాడు. అరంగేట్ర వన్డేలో బంతితో అదరగొట్టాడు. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలా ఓ వికెట్ తీశారు.
సమం చేసుకోవాలంటే..
ఈ మూడో వన్డేలో భారత్ ముందు 249 పరుగుల టార్గెట్ ఉంది. ఈ సిరీస్‍లో తొలి మ్యాచ్ టై కాగా.. రెండో వన్డేలో టీమిండియా ఓడింది. దీంతో సిరీస్ సమం చేసుకోవాలంటే భారత్ చివరిదైన ఈ మూడో వన్డేలో గెలువాల్సిందే. మరి లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన ఛేదిస్తుందేమో చూడాలి.