U19 T20 World Cup: రెండోసారి విశ్వ విజేతగా భారత్.. అండర్ 19 టీ20 ప్రపంచకప్ కైవసం.. తెలుగమ్మాయికే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ
Women’s Under 19 T20 World Cup 2025: అండర్ 19 మహిళల ప్రపంచకప్‍ను భారత్ వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. ఫైనల్‍లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. అదిరే ఆటతో విశ్వవిజేతగా నిలిచింది.
భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. అండర్ 19 టీ20 మహిళల ప్రపంచకప్ టైటిల్ వరుసగా రెండోసారి టీమిండియా కైవసం అయింది. 2023లో ఈ టోర్నీ తొలి ఎడిషన్‍లో టైటిల్ దక్కించుకున్న భారత్.. ఇప్పుడు మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా నేడు (ఫిబ్రవరి 2) జరిగిన అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‍లో భారత అమ్మాయిల జట్టు 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై సునాయాస విజయం సాధించింది. 52 బంతులు మిగిలి ఉండగానే ఘనంగా గెలిచింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‍రౌండ్ షోతో మరోసారి అదరగొట్టారు. మ్యాచ్ ఎలా సాగిందంటే..

కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. తెలుగమ్మాయి అదుర్స్
ఈ ఫైనల్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన దక్షిణాఫ్రికాను భారత అమ్మాయిలు కుప్పకూల్చేశారు. ఈ టోర్నీలో బ్యాటింగ్‍లో చెలరేగిన తెలుగమ్మాయి గొంగడి త్రిష తుదిపోరులో బంతితోనూ అదరగొట్టేశారు. ఈ మ్యాచ్‍లో మూడు వికెట్లను దక్కించుకున్నారు. పరుణిక సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ తలా రెండు వికెట్ల తీసుకోగా.. షబ్నం షకీల్ ఓ వికెట్ పడగొట్టారు.
భారత బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా అమ్మాయిల జట్టు 20 ఓవర్లో 82 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. మీక్ వాన్ వూస్ట్ (23), జెమా బోథా (16) కాసేపు నిలిచారు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఏడుగురు దక్షిణాఫ్రికా బ్యాటర్ల సింగిల్ డిజిట్‍కే పరిమితం అయ్యారు. భారత అమ్మాయిలు బౌలింగ్‍లో సత్తాచాటి ఆ జట్టును కూల్చేశారు.
సూపర్ త్రిష.. భారత అలవోక గెలుపు
ఇప్పటికే ఈ టోర్నీలో అద్బుత ఆట తీరుతో మెప్పించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఫైనల్‍లో దుమ్మురేపారు. 33 బంతుల్లోనే అజేయంగా 44 పరుగులు చేశారు. 8 ఫోర్లు బాదారు. త్రిష చివరి వరకు నిలిచి టీమిండియాను గెలుపుతీరం దాటించారు. స్వల్ప లక్ష్యఛేదనలో కమళిని (8) త్వరగానే ఔటైనా.. త్రిష, సానికా చల్కే (22 బంతుల్లో 26 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడారు. ముఖ్యంగా త్రిష హిట్టింగ్ చేస్తూ ముందుకు సాగారు. దీంతో భారత్ 11.2 ఓవర్లలో ఒక్క వికెటే కోల్పోయి 84 పరుగులు చేసింది. 52 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా గెలిచింది. రెండోసారి అండర్ 19 మహిళల వరల్డ్ కప్‍ను భారత అమ్మాయిలు కైవసం చేసుకున్నారు.
ప్లేయర్ ఆఫ్ ది ట్రోర్నీగా త్రిష
ఈ ప్రపంచకప్‍లో భద్రాచలం అమ్మాయి, తెలుగు ప్లేయర్ గొంగడి త్రిష అద్భుత ప్రదర్శన చేశారు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‍ల్లో 309 పరుగులతో అదరగొట్టారు. 77.25 యావరేజ్ నమోదు చేశారు. అండర్ 19 టీ20 మహిళల ప్రపంచకప్‍లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించారు. బౌలింగ్‍లో ఏడు వికెట్లను కూడా త్రిష పడగొట్టారు. త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది. ఫైనల్‍లోనూ ఆల్‍రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఈ తెలుగమ్మాయికే కైవసం అయింది. త్వరలోనే భారత సీనియర్ మహిళల జట్టులో త్రిషకు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
సంబంధిత కథనం