IND vs SA T20 World Cup Final 2024: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీ ఫైనల్ యుద్ధం షురూ అయింది. ఈ ఏడాది టోర్నీలో ఇప్పటి వరకు అజేయంగా ఉన్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‍పై టీమిండియా కన్నేస్తే.. తొలిసారి ఛాంపియన్‍గా నిలువాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది. బార్బడోస్ వేదిగా నేడు (జూన్ 29) టీ20 ప్రపంచకప్ 2024 తుది సమరం భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు.
ఈ ఫైనల్ సమరానికి తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు భారత్. విన్నింగ్ కాంబినేషన్‍ను కొనసాగించింది. విఫలమవుతున్న శివం దూబేను తప్పించే ఛాన్స్ ఉందని అంచనాలు వచ్చినా.. భారత మేనేజ్‍మెంట్ ఈ ఫైనల్ పోరుకు అతడిని కొనసాగించింది. సెమీస్ ఆడిన జట్టునే దక్షిణాఫ్రికాతో ఈ ఫైనల్‍కు కూడా కంటిన్యూ చేసింది.
టాస్ గెలవడటం టీమిండియాకు కలిసి వచ్చింది. ఫైనల్ లాంటి ఒత్తిడి ఎక్కువగా ఉండే గేమ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసి మంచి స్కోరు చేస్తే.. దక్షిణాఫ్రికాపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఫుల్ ఫామ్‍లో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‍లోనూ దంచికొట్టాలనే కసితో ఉంది.
దక్షిణాఫ్రికా కూడా తుదిజట్టులో మార్పులు చేయలేదు. అదే టీమ్‍తో వస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో ఇప్పటి వరకు అజేయంగా ఉన్న రెండు జట్లు.. టైటిల్ కోసం ఈ తుదిపోరులో హోరాహోరీగా తలపడేందుకు రెడీ అయ్యాయి. ప్రపంచకప్ ఫైనల్ తొలిసారి ఆడుతోంది సౌతాఫ్రికా. భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడుతోంది.
పిచ్ బాగుందని, తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని టాస్ గెలిచాక భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ స్టేడియంలో మంచి స్కోర్లు నమోదయ్యాయని చెప్పాడు. ఇది అత్యంత భారీ మ్యాచ్ అయినా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తామని, ఇతర మ్యాచ్‍ల్లాగే ఫీలవుతామని హిట్ మ్యాన్ చెప్పాడు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్ చెప్పాడు.
భారత తుదిజట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా
దక్షిణాఫ్రికా తుదిజట్టు: క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), రజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్జే, తబ్రైజ్ షంషీ