IND vs SA T20 World Cup Final: ఫైనల్ పోరులో అదరగొట్టిన కోహ్లీ: అక్షర్, దూబే మెరుపులు.. దక్షిణాఫ్రికాకు కఠినమైన టార్గెట్
IND vs SA T20 World Cup Final 2024: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచకప్ ఫైనల్‍లో అదరగొట్టాడు. అక్షర్ పటేల్ కూడా రాణించాడు. దీంతో టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాకు భారత్ కఠినమైన టార్గెట్ ఇచ్చింది.
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ పోరులో టీమిండియా అదరగొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు మంచి స్కోరు చేసింది. తొలుత వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత కోలుకుంది. బార్బడోస్ వేదికగా నేడు (జూన్ 29) జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ అర్ధ శకతంతో అదరగొడితే.. అక్షర్ పటేల్, శివం దూబే రాణించారు. దక్షిణాఫ్రికా ముందు 177 పరుగుల టార్గెట్ ఉంది. సౌతాఫ్రికాను కట్టడి చేస్తే భారత్ టైటిల్ పడుతుంది.
మూడు వికెట్లు టపటపా
టాస్ గెలిచి టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. భీకర ఫామ్‍లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (9) ఫైనల్‍లో విఫలమయ్యాడు. రెండో ఓవర్లో కేశవ్ మహారాజ్ బౌలింగ్‍లో ఔటయ్యాడు. రిషబ్ పంత్ (0) కూడా అదే ఓవర్లో వెనుదిరిగాడు. డకౌట్ అయి నిరాశపరిచాడు. సూర్యకుమార్ యాదవ్ (3) అలా వచ్చి ఇలా వెళ్లాడు. దీంతో 34 పరుగులకే 3 వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.
కోహ్లీ తడాఖ.. అక్షర్ అదుర్స్
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍లో విఫలమైన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యంత కీలకమైన ఫైనల్‍లో అద్భుతంగా ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు దుమ్మురేపాడు. 59 బంతుల్లోనే 76 పరుగులతో కోహ్లీ అదరగొట్టాడు. 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో రాణించాడు. తన మార్క్ షాట్లతో కోహ్లీ అలరించాడు. కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లోనే 47 పరుగులు (ఒక ఫోర్, నాలుగు సిక్స్‌లు) చేశాడు. వెనువెంటనే మూడు వికెట్లు పడినా కోహ్లీ, అక్షర్ దుమ్మురేపారు. అక్షర్ మొదటి నుంచి దూకుడుగా ఆడాడు. పరుగుల వేగం తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. నాలుగో వికెట్‍కు కోహ్లీ, అక్షర్ కీలకమైన 72 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
దూకుడుగా దూబే
అక్షర్ పటేల్ రనౌటైనా విరాట్ కోహ్లీ జోరు కొనసాగించాడు. 48 బంతుల్లో హాఫ్ సెంచరీ చేరాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. శివమ్ దూబే కూడా తన మార్క్ దూకుడు చూపించాడు. 16 బంతుల్లో 27 పరుగులు (3 ఫోర్లు, ఓ సిక్స్) చేశాడు. దీంతో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. బౌండరీల మోత మోగింది. కోహ్లీ 19వ ఓవర్లో ఔట్ అయ్యాడు. దూబే చివరి ఓవర్లో వెనుదిరిగాడు. మొత్తంగా భారత్ 176 పరుగుల భారీ స్కోరు చేసింది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, అన్రిచ్ నోర్జే చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మార్కో జాన్సెన్, కగిసో రబాడ తలా ఓ వికెట్ తీసుకున్నారు.
టీమిండియా రికార్డు
టీ20 ప్రపంచకప్ ఫైనళ్లలో అత్యధిక స్కోరు రికార్డును భారత్ సృష్టించింది. 2021 ఫైనల్‍లో ఆస్ట్రేలియా 173 పరుగులే ఇప్పటి వరకు అత్యధికంగా ఉంది. ఇప్పుడు 176 రన్స్ చేసి రికార్డు సృష్టింది భారత్.