IND vs SA Final: టీ20 వరల్డ్ కప్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. నేడు(శనివారం) వెస్టిండీస్‌లోని బార్బడోస్ వేదికగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఫైనల్ ఫైట్ జరుగనుంది. ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. మరోవైపు లీగ్ దశలో ఆతిథ్య వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైన సౌతాఫ్రికా ఆ తర్వాత పుంజుకొని ఫైనల్ బెర్తును సొంతం చేసుకున్నది. అదృష్టం కలిసి రావడంతో పలు మ్యాచుల్లో ఓటమి నుంచి తృటిలో తప్పించుకున్న సౌతాఫ్రికా...ఇండియాతో ఫైనల్ ఫైట్‌కు రెడీ అయ్యింది.
టీ20ల్లో సౌతాఫ్రికాపై ఇండియాదే డామినేషన్ కనిపిస్తోంది. ఈ పొట్టి ఫార్మెట్‌లో ఇండియా, సౌతాఫ్రికా ఇప్పటివరకు ఇరవై ఆరు సార్లు తలపడ్డాయి. అందులో 14 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించగా 11 సార్లు సౌతాఫ్రికా గెలిచింది. ఓ మ్యాచ్ రద్ధయింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా, సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆరుసార్లు తలపడ్డాయి. నాలుగు మ్యాచుల్లో ఇండియా జయకేతనం ఎగురవేయగా రెండు సార్లు మాత్రమే సౌతాఫ్రికా గెలిచింది. చివరగా 2022 టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాతో టీమిండియా తలపడింది.
ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది సౌతాఫ్రికా. ఈ వరల్డ్ కప్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 133 పరుగులు మాత్రమే చేసింది. ఈ టార్గెట్‌ను కష్టపడి సౌతాఫ్రికా చివరి ఓవర్‌లో ఛేజ్ చేసింది. 2022 వరల్డ్ కప్ ఓటమికి ఫైనల్ ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.
ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన గత ఐదు టీ20 మ్యాచుల్లో మూడింటిలో సౌతాఫ్రికా గెలవగా...కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే టీమిండియా గెలిచింది. అదొక్కటే టీమిండియాను కలవరపెడుతుంది.
ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న బార్బడోస్ స్టేడియం మాత్రం టీమిండియాకు పెద్దగా అచ్చిరాలేదు. ఈ స్టేడియంలో ఇప్పటివరకు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడింది టీమిండియా. అందులో కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. అది కూడా ఈ వరల్డ్ కప్‌లోనే కావడం గమనార్హం. 2024 వరల్డ్ కప్‌లో సూపర్ 8లో ఇదే స్టేడియంలో ఆఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడింది. ఈ మ్యాచ్‌లో విజయాన్ని సాధించింది.
అంతకుముందు 2010 టీ20 వరల్డ్ కప్‌లో ఈ స్టేడియంలో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడగా...ఆ రెండిటిలో ఓటమి పాలైంది. ఈ స్టేడియం మాత్రం రోహిత్ శర్మకు కలిసొచ్చింది. బార్బడోస్ వేదికగా ఆడిన టీ20 మ్యాచుల్లో రోహిత్ శర్మ పరుగుల వరద పారించాడు. ఈ స్టేడియంలో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సులు కొట్టిన టీమిండియా క్రికెటర్‌గా నిలిచాడు.
బార్బడోస్ పిచ్ బ్యాటింగ్‌తో పాటు బౌలర్లకు అనుకూలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం కారణంగా నేడు ఫైనల్ మ్యాచ్ రద్ధయితే రిజర్వ్ డేను కేటాయించారు. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ కొనసాగకపోతే ఇరు జట్టను విజేతలుగా ప్రకటిస్తారు.
ఫైనల్ ఫైట్‌కు ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా, సౌతాఫ్రికా టీమ్‌లుబరిలో దిగబోతున్నాయి. కోహ్లి ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కీలకంగా మారింది. ఇప్పటివరకు వరల్డ్ కప్‌లో ఏడు మ్యాచుల్లో కలిపి కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు కోహ్లి. రోహిత్‌తో పాటు సూర్యకుమార్, హార్దిక్ పాండ్య బ్యాటింగ్ లో అదరగొడుతోన్నారు. అర్షదీప్‌సింగ్, బుమ్రా, పాండ్య పేస్‌తో రాణిస్తోండగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్ మాయతో టీమిండియా బలంగా నిలుస్తోన్నారు.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే, బుమ్రా, అర్షదీప్‌సింగ్,
క్వింటన్ డికాక్, హెండ్రిక్స్, మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్, మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్, రబాడా, నోర్జ్, షంసీ