Ind vs SA 4th T20: సౌాతాఫ్రికా బౌలర్లను చితగ్గొట్టిన తిలక్, సంజూ.. సెంచరీలు, రికార్డుల మోత.. టీమిండియా రికార్డు స్కోరు
Ind vs SA 4th T20: సౌతాఫ్రికాతో నాలుగో టీ20లో తిలక్ వర్మ, సంజూ శాంసన్ చెలరేగిపోయారు. సెంచరీల మోతతోపాటు రికార్డులు హోరెత్తడంతో సఫారీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. తిలక్ వర్మ వరుసగా రెండో టీ20లోనూ సెంచరీ బాదడం విశేషం.
Ind vs SA 4th T20: తిలక్ వర్మ, సంజూ శాంసన్ కార్తీక పౌర్ణమి నాడు శివ తాండవం ఆడారు. సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించారు. తిలక్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ, సంజూ 51 బంతుల్లోనే సెంచరీ బాదడంతో సౌతాఫ్రికాపై నాలుగో టీ20లో టీమిండియా 20 ఓవర్లలో వికెట్ నష్టానికి ఏకంగా 283 పరుగులు చేసింది.
సౌతాఫ్రికాపైనే కాదు.. ఆ దేశంలోనూ ఇదే అత్యధిక టీ20 స్కోరు కావడం విశేషం. తిలక్ వరుసగా రెండో టీ20లో సెంచరీ బాదగా.. సంజూ గత ఐదు ఇన్నింగ్స్ లో మూడో సెంచరీ చేశాడు. తిలక్ 120, సంజూ 107 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
తిలక్, సంజూ రికార్డుల మోత
జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ లో జరిగిన నాలుగో టీ20లో తిలక్ వర్మ, సంజూ శాంసన్ రికార్డుల మోత మోగించారు. సఫారీ బౌలర్లను చితకబాదుతూ సెంచరీలు చేయడమే కాదు.. ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక సిక్స్ ల రికార్డును కూడా నమోదు చేశారు. ఈ మధ్యే హైదరాబాద్ లో బంగ్లాదేశ్ పై 22 సిక్స్ లు బాదగా.. ఈ మ్యాచ్ లో 23 సిక్స్ లతో ఆ రికార్డును తిరగరాశారు. ఇందులో తిలక్ 10, సంజూ 9, అభిషేక్ 4 సిక్స్ లు బాదారు. ఈ ఇద్దరూ కేవలం 93 బంతుల్లోనే రెండో వికెట్ కు అజేయంగా 210 పరుగులు జోడించడం విశేషం. 5.5 ఓవర్లు 73 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. ఆ తర్వాత మరో వికెట్ కోల్పోలేదు.
టీ20 క్రికెట్ లో ఏ వికెట్ కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. తిలక్ వర్మ కేవలం 41 బంతుల్లోనే టీ20ల్లో రెండో సెంచరీ చేశాడు. సౌతాఫ్రికాపై అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డును తిలక్ తన పేరిట రాసుకున్నాడు. మూడో టీ20లోనూ తిలక్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్ తిలక్ వర్మ. సౌతాఫ్రికాతో తొలి టీ20లో సెంచరీ ద్వారా సంజూ శాంసన్ ఆ రికార్డు సాధించిన తొలి ఇండియన్ అయ్యాడు.
ఇక ఈ మ్యాచ్ లోనూ సంజూ శాంసన్ కూడా 51 బంతుల్లోనే టీ20ల్లో తన మూడో సెంచరీ చేశాడు. ఇండియా తరఫున టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన మూడో బ్యాటర్ అతడు. రోహిత్ శర్మ ఐదు సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. గత ఐదు ఇన్నింగ్స్ లోనే అతనికిది మూడో సెంచరీ. మిగిలిన రెండు ఇన్నింగ్స్ లో డకౌట్లయ్యాడు. చివరికి తిలక్ వర్మ 47 బంతుల్లోనే 120 రన్స్ చేయగా.. సంజూ శాంసన్ 56 బంతుల్లో 107 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 10 సిక్స్ లు, 9 ఫోర్లు.. సంజూ 9 సిక్స్ లు, 6 ఫోర్లు బాదారు.