IND vs SA 4th T20: టీమిండియా సిరీస్ గెలుస్తుందా? - సౌతాఫ్రికా సమం చేస్తుందా? - చివరి టీ20లో ప్రయోగాలకు నో ఛాన్స్!
IND vs SA 4th T20: ఇండియా, సౌతాఫ్రికా మధ్య శుక్రవారం (నేడు) నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది. చివరి టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా బరిలోకి దిగుతోంది. ప్రయోగాల జోలికి పోకుండా సేమ్ టీమ్‌తోనే భారత జట్టు బరిలోకి దిగుతోన్నట్లు సమాచారం.
ఇండియా, సౌతాఫ్రికా మధ్య నేడు (శుక్రవారం) నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను టీమిండియా దక్కించుకుంటుందా? సౌతాఫ్రికా విజయం సాధించి సిరీస్‌ను సమం చేస్తుందా? అన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. బలాబలాల పరంగా చూసుకుంటే టీమిండియా గెలుపు అవకాశాలే ఎక్కువగా కనిపిస్తోన్నాయి.
తిలక్ వర్మతో పాటు...
గత మ్యాచ్ సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మ...చివరి టీ20లోనూ బ్యాట్ ఝులిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అతడితో పాటు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ పైనే టీమిండియా అభిమానులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.
సూర్యకుమార్, రింకు సింగ్ విఫలం...
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు హార్దిక్ పాండ్య, రింకు సింగ్ వరుసగా విఫలమవుతోండటం టీమిండియాను కలవరపెడుతోంది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచుల్లో కలిపి సూర్యకుమార్ 26 పరుగులు చేయగా...రింకూ సింగ్ 28 పరుగులు మాత్రమే చేశారు. భారీ షాట్స్ ఆడటంతో ఇద్దరు తడబడిపోతున్నారు. ముఖ్యంగా రింకు సింగ్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. చివరి టీ20లో బ్యాట్‌కు పనిచెబితేనే టీమిండియాలో అతడి స్థానం పదిలమయ్యే అవకాశం ఉంది. రమణ్‌దీప్‌ను మరో ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ముగ్గురు స్పిన్నర్లు...
హార్దిక్ పాండ్య బ్యాటింగ్‌లో పర్వాలేదనిపిస్తోన్న బౌలింగ్‌లో మాత్రం ధారాళంగా పరుగులు ఇస్తోన్నాడు. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో సౌతాఫ్రికాకు ఉన్న బలహీనతను దృష్టిలో పెట్టుకొని మరోసారి ముగ్గురు స్పిన్నర్లను టీమిండియాఆడించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చివరి టీ20లో బౌలింగ్ పరంగా వరుణ్ చక్రవర్తిపైనే భారం ఎక్కువగా ఉంది. ఈ సిరీస్‌లో అంచనాలకు మించి అతడు రాణిస్తోన్నాడు.
అంచనాలకు తగ్గట్లుగా...
హిట్టర్లు క్లాసెన్, స్టబ్స్, మార్‌క్రమ్, మిల్లర్ వరుసగా విఫలమవుతోండటం సౌతాఫ్రికా ఓటములకు కారణమవుతోంది. తొమ్మిదో స్థానం వరకు హిట్టర్లు ఉండటం సౌతాఫ్రికా కొంత సానుకూలంశంగా చెప్పవచ్చు. ఇరు టీమ్‌లు తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా చివరి మ్యాచ్‌లో బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా ఆధిక్యం...
నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలి టీ20తో మూడో టీ20లో భారత్ విజయాన్ని సాధించగా...రెండో టీ20లో సౌతాఫ్రికా విజయాన్ని సాధించింది.