IND vs SA 3rd T20: సెంచరీతో సూర్య కుమార్ యాదవ్ ఊచకోత.. వరల్డ్ రికార్డ్ సమం.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే?
IND vs SA 3rd T20 First Innings: భారత్, దక్షిణాఫ్రికా మధ్య గురువారం (డిసెంబర్ 14) జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో ఊచకోత కోశాడు. ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది టీమిండియా. ఇంకా మ్యాచ్ ఎలా సాగిందంటే..
India vs South Africa T20 Series: సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 సిరీస్ మూడో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దు కాగా రెండో మ్యాచ్‌లో గెలిచిన దక్షిణ ఆఫ్రికా ఆధిక్యం సాధించింది. దీంతో ఈ సిరీస్ మూడో మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం (డిసెంబర్ 14) దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ వేదికైంది.
టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి రెండు ఓవర్లలో టీమిండియా బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ చెలరేగి ఆడారు. కానీ, రెండు బౌండరీలు బాదిన శుభ్‌మన్ గిల్ 6 బాల్స్ ఆడి 8 పరుగుల వద్ద ఎల్బీడబ్లూ అయ్యాడు. అనంతరం వచ్చిన తిలక్ వర్మ ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. రెండు వికెట్లు తీసి ఆదిలోనే అడ్డు కట్ట వేసే ప్రయత్నం చేశాడు సౌతాఫ్రికా బౌలర్ మహారాజ్.
అనంతరం గ్రౌండ్‌లోకి దిగిన సూర్య కుమార్ యాదవ్ పరుగులతో ఊచకోత కోశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలకు చెమటలు పట్టించాడు. 56 బాల్స్‌కు 100 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. వాటిలో 8 సిక్స్‌లు, 7 బౌండరీలతో అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల (4) ప్రపంచ రికార్డును సమం చేశాడు యాదవ్. ఈ రికార్డ్‌ను మ్యాక్స్‌వెల్, రోహిత్ శర్మ సమం చేయగా తాజాగా ఈ ఇద్దరి సరసన సూర్య కుమార్ యాదవ్ చేరాడు.
సెంచరీ పూర్తి అయిన వెంటనే విలియమ్స్ వేసిన ఫుల్ టాస్ బాల్‌ను షాట్ కొట్టగా.. బౌండరీ వద్ద బ్రీట్జ్కే క్యాచ్ పట్టాడు. దాంతో సూర్య కుమార్ యాదవ్ పరుగుల వర్షం ఆగిపోయింది. అలాగే 41 బంతులకు 60 పరుగులు చేసి అదరగొట్టాడు యశస్వి జైశ్వాల్. చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు జడేజా రావడంతోనే ఫోర్ బాదాడు. కానీ, వెంటనే జితేశ్ శర్మ వల్ల రనౌట్ అయ్యాడు. ఇక టీ20 మూడో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. దాంతో సౌతాఫ్రికా ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు కీలకంగా మారింది.