IND vs SA 2nd T20I: ఇండియా, సౌతాఫ్రికా రెండో టీ20 కూడా అనుమానమే.. టీమిండియా తుది జట్టు ఇదే
IND vs SA 2nd T20I: ఇండియా, సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ జరగడం కూడా అనుమానంగా మారింది. ఈ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. మరోవైపు టీమిండియా తుది జట్టులో ఎవరు ఉండబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.
IND vs SA 2nd T20I: ఇండియా, సౌతాఫ్రికా మధ్య డర్బన్ లో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన సంగతి తెలుసు కదా. ఇప్పుడు రెండో టీ20కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ సౌతాఫ్రికాలోని గెబెరా(గతంలో పోర్ట్ ఎలిజబెత్)లో జరగనుంది. అయితే అక్కడ మంగళవారం (డిసెంబర్ 12) వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండో టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది.
ఆస్ట్రేలియాపై ఐదు టీ20ల సిరీస్ ను 4-1తో గెలిచి సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన టీమిండియా తొలి మ్యాచ్ లోనే విజయంతో ఘనంగా ప్రారంభించాలని భావించింది. అయితే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు రెండో మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు ఉండటం నిరాశ కలిగిస్తోంది.
రెండో టీ20 జరుగుతుందా?
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ కు ముందు ఇండియా మరో ఐదు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్ రద్దవగా మరో రెండు టీ20లు, ఆఫ్ఘనిస్థాన్ తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇప్పుడు సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్ కు కూడా వర్షం అడ్డు పడితే వరల్డ్ కప్ సంసిద్ధత దెబ్బ తింటుంది.
అయితే రెండో మ్యాచ్ జరిగి గెబెరాలో మంగళవారం (డిసెంబర్ 12) 99 శాతం ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. ఇక ఉదయం పూట 63 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉండగా.. సాయంత్రం మ్యాచ్ సమయానికి ఇది 6 శాతానికి తగ్గింది. ఇదే కాస్త ఊరట కలిగించే విషయం.
టీమిండియా తుది జట్టు ఎలా ఉండనుంది?
తొలి టీ20 కనీసం టాస్ కూడా పడకుండానే రద్దవడంతో ఆ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టును చూసే అవకాశం కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ కు ఎవరుంటారన్న ఆసక్తి నెలకొంది. టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం కోసం ఆరాటపడుతున్న యువకులు సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కోహ్లి, రోహిత్, హార్దిక్, బుమ్రా లేని నేపథ్యంలో వాళ్లకు ఇదే మంచి అవకాశం.
దీంతో సౌతాఫ్రికా సిరీస్ కు వర్షం అడ్డు పడకూడదని వాళ్లు కోరుకుంటున్నారు. ఒకవేళ రెండో టీ20 సజావుగా జరిగితే తుది జట్టులో ఎవరు ఉండబోతున్నారన్నది ఆసక్తికరం. ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్ కు దూరంగా ఉన్న గిల్, జడేజా, సిరాజ్ లాంటి వాళ్లు తిరిగి రావడంతో తుది జట్టులో మార్పులు తప్పవు.
టీమిండియా తుది జట్టు అంచనా
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, రింకు సింగ్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, దీపక్ చహర్/ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్