IND vs PAK: అదరగొట్టిన హార్దిక్, ఇషాన్.. పాకిస్థాన్‍కు మోస్తరు టార్గెట్
IND vs PAK: పాకిస్థాన్‍కు మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అర్ధ శతకాలతో అదరగొట్టడంతో టీమిండియా మంచి స్కోరు చేయగలిగింది.
IND vs PAK Asia Cup 2023: ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‍తో జరుగుతున్న మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పోరాడే స్కోరు చేసింది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో నేడు (సెప్టెంబర్ 2) గ్రూప్-ఏలో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. భారత్ స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా (90 బంతులకు 87 పరుగులు; 7 పోర్లు, ఒక సిక్స్), ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82 పరుగులు; 9 ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్ధ శతకాలతో అదరగొట్టారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమైనా ఆ ఇద్దరూ రాణించటంతో టీమిండియా పోరాడే స్కోరు చేయగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో షహిన్ షా అఫ్రిది నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. నసీమ్ షా, హరిస్ రవూఫ్‍కు చెరో మూడు వికెట్లు దక్కాయి. పాకిస్థాన్ ముందు 267 పరుగుల లక్ష్యం ఉంది. టీమిండియా బ్యాటింగ్ ఎలా సాగిందంటే..

టపటపా వికెట్లు
టాస్ గెలిచిన బ్యాటింగ్‍కు దిగిన టీమిండియాను పాకిస్థాన్ పేసర్లు ఇబ్బందులు పెట్టారు. వర్షం ఆటంకం తర్వాత మళ్లీ మ్యాచ్ మొదలుకాగా పాక్ పేసర్ షహిన్ షా అప్రిది అదరగొట్టాడు. ఐదో ఓవర్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (11)ను అద్భుతమైన ఇన్‍స్వింగర్‌తో బౌల్డ్ చేసిన అతడు… ఏడో ఓవర్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (4)ని ఔట్ స్వింగర్ వేసి బౌల్డ్ చేశాడు. మరో ఎండ్‍లో శుభ్‍మన్ గిల్ (10) పరుగులు చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డాడు. చాలా కాలం తర్వాత టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ (14) కాసేపు ధాటిగా ఆడినా పదో ఓవర్లో హరిస్ రావూఫ్ బౌలింగ్‍లో ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లలో టీమిండియా 48 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత శుభ్‍మన్ గిల్ కూడా పెవిలియన్ చేరటంతో టీమిండియా 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.
అదరగొట్టి ఆదుకున్న ఇషాన్, హార్దిక్
4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో భారత బ్యాటర్లు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడారు. ఆరంభంలో నిలకడగా ఆడుతూనే పరుగులు రాబట్టారు. ఆ తర్వాత వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. దీంతో టీమిండియా కోలుకుంది. ఇషాన్, హార్దిక్ నిలకడగా ఆడటంతో 30.1 ఓవర్లలో 150 పరుగులు మార్కును చేరుకుంది భారత్. ఇషాన్ కిషన్ 54 బంతుల్లోనే అర్ధ శకతం చేశాడు. దూకుడు పెంచిన హార్దిక్ పాండ్యా కూడా 62 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. ఆ తర్వాత కూడా వారిద్దరూ హిట్టింగ్ చేశారు. దీంతో 36.4 ఓవర్లనే 200 పరుగులకే చేరి టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, ఆ తర్వాత ఇషాన్ కిషన్‍ను 38వ ఓవర్లో హరిస్ రవూఫ్ ఔట్ చేశాడు. దీంతో 138 భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత షాహిన్ షా అఫ్రిది వేసిన 44వ ఓవర్లో పాండ్యా ఔట్ కాగా.. అదే ఓవర్లో రవీంద్ర జడేజా (14) కూడా వెనుదిరిగాడు. శార్దూల్ ఠాకూర్ (3) ఎక్కువ సేపు నిలువలేదు. ఏడు బంతుల వ్యవధిలోనే ఈ ముగ్గురు పెవిలియన్ చేరటంతో టీమిండియా మళ్లీ కష్టాల్లో పడింది. చివర్లో జస్‍ప్రీత్ బుమ్రా (16) విలువైన పరుగులు చేసి, 49వ ఓవర్లో ఔటవటంతో టీమిండియా ఆలౌటైంది. బుమ్రాకు కుల్దీప్ (4) కాసేపు సహకరించాడు. చివర్లో వచ్చిన సిరాజ్ (1) నాటౌట్‍గా నిలిచాడు. మొత్తంగా భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది.