ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‍లో భారత స్పిన్ మంత్రం ఫలించింది. నేడు (మార్చి 9) దుబాయ్ స్టేడియంలో జరుగుతున్న టైటిల్ పోరులో న్యూజిలాండ్ బ్యాటర్లను టీమిండియా స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టారు. అయితే, పేసర్లు ఆకట్టుకోలేకపోయారు. దీంతో ఈ ఫైనల్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. టైటిల్ కైవసం చేసుకునేందుకు టీమిండియా ముందు 252 లక్ష్యం ఉంది. ఈ ఇన్నింగ్స్ ఎలా సాగిందంటే..
తుదిపోరులో భారత స్పిన్నర్లు సమిష్టిగా సత్తాచాటారు. వరుణ్ చక్రవర్తి 10 ఓవర్లలో 45 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో రన్స్ ఇచ్చి రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 30 రన్సే ఇచ్చి ఓ వికెట్ దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా ఎకనమిక్‍గా బౌలింగ్ చేశాడు. ఇలా టీమిండియా స్పినర్లు రాణించటంతో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు విలవిల్లాడారు. భారత పేసర్ మహమ్మద్ షమీకి ఓ వికెట్ దక్కింది. అయితే, పేసర్లు షమీ, హార్దిక్ పాండ్యా పరుగులు ఎక్కువగా ఇచ్చేశారు. షమీ 9 ఓవర్లలో 74 పరుగులు సమర్పించగా.. హార్దిక్ 3 ఓవర్లలో 30 రన్స్ ఇచ్చేశాడు.
టాస్ గెలిచి ముందు బ్యాటింగ్‍కు దిగింది న్యూజిలాండ్. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (37), విల్ యంగ్ (15) నిలకడగా ఆడారు. భారత పేసర్లు మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యాను దీటుగా ఎదుర్కొన్నారు. క్రమంగా పరుగులు రాబట్టారు. ఎనిమిదో ఓవర్లో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రాకతో కివీస్ కష్టాలు మొదలయ్యాయి. ఆ ఓవర్లో విల్ యంగ్‍ను పెవిలియన్ పంపాడు వరుణ్.
జోరుగా ఆడుతున్న రచిన్ రవీంద్రను తన తొలి బంతికే కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. అప్పటికే రెండుసార్లు క్యాచ్ మిస్‍లతో బతికిపోయిన రచిన్ ఎట్టకేలకు ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 13వ ఓవర్లోనే కివీస్ సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (11)ను పెవిలియన్‍కు పంపి రెచ్చిపోయాడు కుల్దీప్. దీంతో 75 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది న్యూజిలాండ్. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్ తప్పిదాలు జరిగినా బౌలర్లు మాత్రం పట్టు సడలనివ్వలేదు.
కివీస్ బ్యాటర్ టామ్ లాథమ్ (14)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఓ ఎండ్‍లో వికెట్లు పడుతున్నా డారిల్ మిచెల్ (101 బంతుల్లో 63 పరుగులు; 3 ఫోర్లు) ఒంటరిగా పోరాడాడు. పరిస్థితికి తగ్గట్టుగా నిలకడగా ఆడుతూ పరుగులు చేశాడు. అతడికి గ్లెన్ ఫిలిఫ్స్ (34) తోడుగా నిలిచాడు. ఆ ఇద్దరూ 57 పరుగుల పార్ట్‌నర్‌షిప్ జోడించారు. ఈ భాగస్వామ్యం భారత్‍లో కాస్త టెన్షన్ పెంచింది. అయితే, 38వ ఓవర్లో ఫిలిఫ్స్ ను ఔట్ చేసి దెబ్బకొట్టాడు వరుణ్.
నెమ్మదిగా ఆడిన డారిల్ మిచెల్ 91 బంతుల్లో హాఫ్ సెంచరీ చేరాడు. అతడిని 46వ ఓవర్లో ఔట్ చేశాడు భారత పేసర్ మహమ్మద్ షమీ. దీంతో 211 రన్స్ వద్ద ఆరో వికెట్ చేజార్చుకుంది న్యూజిలాండ్. చివర్లో మైకేల్ బ్రేస్‍వెల్ (40 బంతుల్లో 53 పరుగులు, నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టాడు. అజేయ అర్ధ శకతం చేశాడు. కెప్టెన్ శాంట్నర్ (8) కాసేపు అతడికి సహకరించాడు. బ్రేస్‍వెల్ దూకుడుగా ఆడి కివీస్‍కు 251 పరుగుల మోస్తరు స్కోరు అందించాడు. టైటిల్ గెలువాలంటే భారత్ ముందు 252 పరుగులు టార్గెట్ ఉంది.
ఈ ఫైనల్ మ్యాచ్‍లో భారత్ పదేపదే ఫీల్డింగ్ తప్పిదాలు చేసింది. నాలుగు క్యాచ్‍లను ఆటగాళ్లు చేజార్చారు. రచిన్ రవీంద్ర ఇచ్చిన రిటర్న్ క్యాచ్‍ను షమీ పట్టలేకపోయాడు. వేలికి రక్తం కూడా వచ్చింది. రచిన్ రవీంద్ర క్యాచ్‍నే శ్రేయస్ అయ్యర్ కూడా విడిచిపెట్టాడు. డారిల్ మిచెల్ క్యాచ్‍ను కెప్టెన్ రోహిత్ శర్మ c. ఆ క్యాచ్ అందుకొని ఉంటే మిచెల్ 38 పరుగులకే ఔటయ్యే వాడు. గ్లెన్ ఫిలిప్స్ ఇచ్చిన క్యాచ్‍ను గిల్ వదిలేశాడు. ఇలా నాలుగు క్యాచ్‍లను టీమిండియా నేలపాలు చేసింది. ఇవి కూడా పట్టి ఉంటే లక్ష్యం మరింత తక్కువగా ఉండే అవకాశం ఉండేది.
సంబంధిత కథనం