పన్నెండేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న భారత్ తుది సమరంలో బరిలోకి దిగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ నేడు (మార్చి 9) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మొదలైంది. ఈ ఏడాది టోర్నీలో ఇప్పటి వరకు అజేయంగా ఉన్న రోహిత్‍శర్మ సేన తుదిపోరులోనూ సత్తాచాటి టైటిల్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. సెమీస్‍లో భారీ గెలుపుతో సత్తాచాటి ఫైనల్‍కు ఉత్సాహంగా అడుగుపెట్టింది న్యూజిలాండ్. ఈ ఫైనల్ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. మరోసారి టాస్ ఓడాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం తుదిజట్టులో భారత్ మార్పులు చేయలేదు. సెమీస్ ఆడిన జట్టునే కొనసాగించింది. విన్నింగ్ కాంబినేషన్‍తోనే తుదిపోరులో బరిలోకి దిగుతోంది. తుదిజట్టులో న్యూజిలాండ్ ఓ మార్పు చేసింది. గాయపడిన పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్‍ను జట్టులోకి తీసుకుంది. కాగా, వన్డేల్లో వరుసగా 15వ సారి టాస్ ఓడింది భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీ తుదిపోరుకు టీమిండియా అజేయంగా అడుగుపెట్టింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్‍ను చిత్తుచేసిన భారత్.. సెమీఫైనల్‍లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. అపజయం లేకుండా ఫైనల్‍కు వచ్చింది. దీంతో ఫైనల్‍లో భారతే ఫేవరెట్‍గా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీల్లో ఫైనల్ చేరడం టీమిండియాకు ఇది ఐదోసారి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టోర్నీలో భారత్ చేతిలో ఒక్కటే గ్రూప్ దశలో ఓడింది న్యూజిలాండ్. సెమీస్‍లో దక్షిణాఫ్రికాపై సాధించిన భారీ విజయంతో చాలా ఆత్మవిశ్వాసంతో కివీస్ ఉంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‍లో భారత్‍ను ఓడించి దెబ్బకొట్టింది న్యూజిలాండ్. ఇప్పుడు ఫైనల్ గెలిచి ఛాంపియన్స్ కప్ సాధిస్తే దానికి కూడా టీమిండియా బదులుతీర్చుకున్నట్టు అవుతుంది.
భారత తుదిజట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి
న్యూజిలాండ్ తుదిజట్టు: రచిన్ రవీంద్ర, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జెమిసన్, విలియం ఓరౌర్కే
భారత్ 2002, 2013ల్లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కైవసం చేసుకుంది. 2017లో ఫైనల్ చేరినా పాకిస్థాన్ చేతిలో పరాజయం ఎదురైంది. ఈసారి ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఈ 2025 టోర్నీ జరుగుతోంది. 2013లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పట్టింది భారత్. ఇప్పుడు 12ఏళ్ల తర్వాత మళ్లీ ఆ టైటిల్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో రోహిత్ సారథ్యంలోని భారత్ ఉంది. న్యూజిలాండ్ 2000లో ఒకేసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అప్పుడు ఫైనల్‍లో టీమిండియాపైనే గెలిచింది. నేటి ఈ ఫైనల్ గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించాలని టీమిండియా కసిగా ఉంది.
సంబంధిత కథనం