IND vs ENG: హర్షిత్ రాణా సబ్‍స్టిట్యూట్ ఎంట్రీపై వివాదం.. ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ అసంతృప్తి.. ఐసీసీ రూల్ ఏం చెబుతోంది?
IND vs ENG 4th T20: భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20లో భారత పేసర్ హర్షిత్ రాణా.. కన్‍కషన్ సబ్‍స్టిట్యూట్‍గా వచ్చాడు. దీనిపై వివాదం రేగుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐసీసీ రూల్ ఎలా ఉందంటే..
ఇంగ్లండ్‍తో నాలుగో టీ20లో భారత్ విజయం సాధించింది. 3-1తో ఐదు టీ20ల సిరీస్‍ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ముంబై వేదికగా శుక్రవారం ఇంగ్లండ్‍తో జరిగిన నాలుగో మ్యాచ్‍లో భారత్ 15 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‍లో భారత ఆల్‍రౌండర్ శివం దూబేకు కన్‍కషన్ సబ్‍స్టిట్యూట్‍గా యంగ్ పేసర్ హర్షిత్ రాణా బరిలోకి దిగాడు. భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. రాణాను సబ్‍స్టిట్యూట్‍గా భారత్ తీసుకోవడంపై వివాదం రేగుతోంది. ఆ వివరాలు ఇవే..

ఏం జరిగింది!
నాలుగో టీ20లో భారత బ్యాటర్ శివమ్ దూబే 34 బంతుల్లోనే 53 పరుగులతో అదరగొట్టాడు. ఈ సిరీస్‍తో తొలిసారి ఆడిన దూబే కీలక సమయంలో అర్ధ శకతంతో మెరిశాడు. అయితే ఇంగ్లండ్ పేసర్ ఓవర్టన్ వేసిన చివరి ఓవర్ ఐదో బంతి.. దూబే హెల్మెట్‍కు బలంగా తగిలింది. ఫిజియో వచ్చి చెక్ చేశారు. చివరి బంతి కూడా అయితే, భారత్ ఫీల్డింగ్‍కు వచ్చినప్పుడు దూబే మాత్రం రాలేదు. దూబేకు కన్‍కషన్ సబ్‍స్టిట్యూట్‍గా యంగ్ పేసర్ హర్షిత్ రాణాను భారత్ బరిలోకి దింపింది.
హర్షిత్ రాణా తన అరంగేట్రంలోనే కీలకమైన ఇంగ్లండ్ మూడు వికెట్లు పడగొట్టి మెరిశాడు. లియామ్ లివింగ్‍స్టోన్, జాకో బేథల్ సహా జెమీ ఓవర్టన్‍ను పెవిలియన్‍కు పంపాడు. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, దూబేకు సబ్‍స్టిట్యూట్‍గా రాణాను టీమిండియా తీసుకోవడం సరికాదంటూ వివాదం రేగుతోంది.
బట్లర్ అసంతృప్తి
శివమ్ దూబేకు హర్షిత్ రాణాను కంకషన్ రిప్లేస్‍మెంట్‍గా తీసుకురావడం సరికాదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. ఆ ఇద్దరు ఒకేలాంటి ప్లేయర్లు కాదని మీడియా సమావేశంలో చెప్పాడు. రాణా అంత మెరుగ్గా దూబే బౌలింగ్ ఉండదని, దూబేలా రాణా బ్యాటింగ్ చేయగలడా అనేలా వెటకారంగా మాట్లాడాడు. మొత్తంగా దూబేకు రాణాను సబ్‍స్టిట్యూట్‍గా తీసుకోవడంపై అసంతప్తి చెందాడు.
ఐసీసీ రూల్ ఇలా..
ఐసీసీ కంకషన్ సబ్‍స్టిట్యూట్ ప్లేయింగ్ కండిషన్ 1.2.7.3 రూల్.. రిప్లేస్‍మెంట్ గురించి చెబుతోంది. మిగిలిన మ్యాచ్‍ను గాయం వల్ల ఏ ప్లేయర్ అయినా ఆడలేకపోతే.. దాదాపు అలాంటి స్కిల్స్ ఉన్న మరో ఆటగాడిని రిప్లేస్ చేసుకునేలా జట్టుకు ఐసీసీ మ్యాచ్ రిఫరీ అనుమతి ఇవ్వొచ్చని ఆ నిబంధనలో ఉంది. జట్టుకు మరీ ఎక్కువ ఆడ్వాటేంజ్ లేకుండా లైక్ ఫర్ లైక్ లాంటి ఆటగాడిని రిప్లేస్ చేయాలని ఉంది.
“కంకషన్ రిప్లేస్‍మెంట్‍కు సంబంధించి ఐసీసీ మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం. ఏ టీమ్‍కు అయినా దీనిపై అప్పీల్ చేసే హక్కు ఉండదు” అని 1.2.7.7 ఐసీసీ రూల్ చెబుతోంది.
శివమ్ దూబే.. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. దీంతో అతడు మిగిలిన మ్యాచ్ ఆడలేకపోవడంతో పేసర్ హర్షిత్ రాణాను కన్‍కషన్ సబ్‍స్టిట్యూట్‍గా మ్యాచ్ రిఫరీ అంగీకరించారు. అయితే, రాణా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‍ను దెబ్బకొట్టాడు. దీంతో ఈ సబ్‍స్టిట్యూట్ సరికాదంటూ ఇంగ్లండ్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో రాణాను టీమిండియా రిప్లేస్‍మెంట్‍గా తీసుకోవడం కరెక్టేనని, రిఫరీనే అంగీకరించారు కదా అని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం