Virat Kohli: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ - రెండు రేర్ రికార్డులకు చేరువలో కోహ్లి - అవి ఏవంటే?
Virat Kohli: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో సచిన్ రికార్డులను కోహ్లి బ్రేక్ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య నేడు విదర్భ వేదికగా తొలి వన్డే మ్యాచ్ మొదలుకానుంది. ఈ వన్డేలో కోహ్లి, రోహిత్ ఎలా ఆడుతారన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.

Virat Kohli: టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా వన్డే సమరానికి సిద్ధమైంది. నేటి నుంచి ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది.
కోహ్లి, రోహిత్‌పైనే...
ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఎలా ఆడుతారన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు రంజీ మ్యాచుల్లో వీరిద్దరు దారుణంగా విఫలమయ్యారు. కోహ్లి, రోహిత్ పనైపోయిందని, జట్టు నుంచి వారిని తప్పించాలంటూ విమర్శలు వస్తోన్నాయి.
ఈ విమర్శలకు వారు ఎంత వరకు బదులు ఇస్తారనే ఆన్సర్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ ఈ నెలలోనే ప్రారంభమవుతోన్న నేపథ్యంలో వీరిద్దరు ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కీలకంగా మారింది.
14 వేల పరుగులు...
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రెండు రేర్ రికార్డులపై కోహ్లి కన్నేశాడు. వన్డే క్రికెట్‌లో 14 వేల పరుగులు పూర్తి చేయడానికి మరో 96 పరుగుల దూరంలో కోహ్లి ఉన్నాడు. ప్రస్తుతం 13906 పరుగుల ఉన్నాడు. తొలి వన్డేలో కోహ్లి 96 పరుగులు చేస్తే పధ్నాలుగు వేల పరుగుల్ని అత్యంత వేగంగా పూర్తిచేసిన తొలి క్రికెటర్‌గా రికార్డ్ అందుకుంటాడు. వన్డేల్లో పధ్నాలుగు వేల పరుగల్ని సచిన్ 350 ఇన్నింగ్స్‌లలో, సంగాక్కర 378 ఇన్నింగ్స్‌లలో పూర్తిచేశారు. కోహ్లి మాత్రం 296 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును చేరుకునే అవకాశం ఉంటుంది.
కోహ్లి మరో మూడు సెంచరీలు లేదా హాఫ్ సెంచరీలు చేస్తే స్వదేశంలో అరవై కంటే ఎక్కువ సార్లు యాభైకిపైగా పరుగులు చేసిన ఫస్ట్ ప్లేయర్‌గా నిలుస్తాడు. ఈ లిస్ట్‌లో సచిన్ ముందున్నాడు.
సీనియర్ ప్లేయర్లు...
రోహిత్, కోహ్లితో పాటు టీ20 సిరీస్‌కు దూరమైన కేఎల్ రాహుల్, పంత్, జడేజా సహా పలువురు సీనియర్ ప్లేయర్స్ వన్డే సిరీస్‌లో బరిలోకి దిగనున్నారు. యంగ్ ప్లేయర్లు దూకుడుగా ఆడుతోన్న నేపథ్యంలో సీనియర్లపై ఒత్తిడి పెరిగింది. తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.