IND vs ENG 5th Test: 700 వికెట్ల క్ల‌బ్‌లో అండ‌ర్స‌న్‌ - మూడో బౌల‌ర్‌గా రికార్డ్ - టీమిండియాకు భారీ ఆధిక్యం-ind vs eng 5th test anderson becomes 3rd bowler to take 700 wickets in test cricket ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 5th Test: 700 వికెట్ల క్ల‌బ్‌లో అండ‌ర్స‌న్‌ - మూడో బౌల‌ర్‌గా రికార్డ్ - టీమిండియాకు భారీ ఆధిక్యం

IND vs ENG 5th Test: 700 వికెట్ల క్ల‌బ్‌లో అండ‌ర్స‌న్‌ - మూడో బౌల‌ర్‌గా రికార్డ్ - టీమిండియాకు భారీ ఆధిక్యం

IND vs ENG 5th Test: ఐదో టెస్ట్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 477 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లండ్‌పై 259 ప‌రుగుల ఆధిక్యాన్ని ద‌క్కించుకున్న‌ది. ఈ టెస్ట్‌లో ఇంగ్లండ్ పేస‌ర్ అండ‌ర్స‌న్ చ‌రిత్ర‌ను సృష్టించాడు. ఏడు వంద‌ల వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

జేమ్స్ అండ‌ర్స‌న్‌

IND vs ENG 5th Test: ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతోన్న ఐదో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 477 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లండ్‌పై 259 ప‌రుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న‌ది. ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 473 ర‌న్స్‌తో మూడో రోజు ప్రారంభించిన టీమిండియా కేవ‌లం నాలుగు ప‌రుగులు మాత్ర‌మే జోడించి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్‌ను అండ‌ర్స‌న్ ఔట్ చేయ‌గా బుమ్రా వికెట్ బ‌షీర్‌కు ద‌క్కింది. టీమిండియాకు ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 259 ప‌రుగులు ఆధిక్యం ద‌క్కింది.

అండ‌ర్స‌న్ రికార్డ్‌...

ఐదో టెస్ట్‌తో ఇంగ్లండ్ సీనియ‌ర్ పేస‌ర్ అండ‌ర్స‌న్ కొత్త రికార్డ్ నెల‌కొల్పాడు. టెస్టుల్లో ఏడు వంద‌ల వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. దిగ్గ‌జ స్పిన్న‌ర్లు ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌, షేన్‌వార్న్ త‌ర్వాత ఈ ఘ‌న‌త‌ను సాధించిన మూడో క్రికెట‌ర్‌గా అండ‌ర్స‌న్ రికార్డ్ నెల‌కొల్పాడు. టెస్టుల్లో ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ 800 వికెట్లు తీసుకోగా...షేన్‌వార్న్ 708 వికెట్లు ద‌క్కించుకున్నాడు. 700 వికెట్ల‌తో అండ‌ర్స‌న్ మూడో ప్లేస్‌లో నిలిచాడు.టెస్టుల్లో ఏడు వంద‌ల వికెట్లు తీసిన తొలి పేస‌ర్‌గా జేమ్స్ అండ‌ర్స‌న్ నిలిచాడు. కుల్దీప్ వికెట్‌తో అండ‌ర్స‌న్ 700 వికెట్ల క్ల‌బ్‌లో ఎంట‌ర‌య్యాడు.

రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీలు...

రోహిత్ శ‌ర్మ (103 ప‌రుగులు), శుభ్‌మ‌న్ గిల్ (110 ర‌న్స్‌) సెంచ‌రీలు సాధించ‌డంతో టీమిండియా ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. వ‌న్డే త‌ర‌హాలో దూకుడుగా ఆడిన వీరిద్ద‌రు ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టారు. టెస్టుల్లో రోహిత్ శ‌ర్మ‌కు ఇది 12వ సెంచ‌రీ కాగా...గిల్‌కు నాలుగో టెస్ట్ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌లో య‌శ‌స్వి జైస్వాల్‌, స‌ర్ఫ‌రాజ్‌ఖాన్‌, దేవ‌ద‌త్ ఫ‌డిక్క‌ల్ హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో బ‌షీర్‌కు ఐదు వికెట్లు తీయ‌గా...అండ‌ర్స‌న్, హార్ట్‌లీ త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు.

వందో టెస్ట్‌...

అంత‌కుముందు ఇంగ్లండ్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 218 ప‌రుగులు చేసింది. క్రాలీ మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫ‌ల‌మ‌య్యారు. టీమిండియా బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ ఐదు, అశ్విన్ నాలుగు వికెట్లు తీసుకున్నారు. అశ్విన్‌కు ఇది వందో టెస్ట్ కావ‌డం గ‌మ‌నార్హం. వందో టెస్ట్‌లో డ‌కౌట్ అయిన ప్లేయ‌ర్‌గా అశ్విన్ చెత్త రికార్డును మూట గ‌ట్టుకున్నాడు.

నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌...

ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-1తో ఇప్ప‌టికే టీమిండియా కైవ‌సం చేసుకున్న‌ది. ధ‌ర్మ‌శాల టెస్ట్‌లో విజ‌యం దిశ‌గా సాగుతోంది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో పాటు ప‌లువురు సీనియ‌ర్లు ఈ సిరీస్‌కు దూర‌మ‌య్యారు. య‌శ‌స్వి జైస్వాల్‌, స‌ర్ఫ‌రాజ్‌ఖాన్‌, ధ్రువ్ జురేల్ వంటి అరంగేట్రం ప్లేయ‌ర్లు స్ఫూర్తిదాయ‌క ఆట‌తో టీమిండియాకు ఈ సిరీస్‌ను అందించారు. ఐదో టెస్ట్‌లో టీమిండియా విజ‌యం సాధిస్తే డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకుంటుంది.