IND vs ENG 4th T20: టీమిండియా సిరీస్ గెలుస్తుందా? - ఇంగ్లండ్ సమం చేస్తుందా? - నేడు నాలుగో టీ20!
IND vs ENG 4th T20: ఇండియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం (నేడు) నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది. మూడో టీ20 ఓటమి నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. రింకు సింగ్, అర్షదీప్ సింగ్ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
IND vs ENG 4th T20: ఇండియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ శుక్రవారం (నేడు) జరుగనుంది. మూడో టీ20లో ఓటమి నేపథ్యంలో పుణె వేదికగా జరుగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రింకు సింగ్‌తో పాటు అర్షదీప్ సింగ్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతోన్నాయి.

రింకు సింగ్ రీఎంట్రీ...
వెన్ను నొప్పితో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన రింకు సింగ్ నాలుగో టీ20లో తుది జట్టులో స్థానం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ధృవ్‌జురేల్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడంతో అతడిపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. సెకండ్, థర్డ్ టీ20ల్లో ధృవ్ జురేల్ దారుణంగా విఫలమయ్యాడు.
రెండు మ్యాచుల్లో కలిపి ఆరు పరుగులు మాత్రమే చేశాడు. మూడో టీ20కి దూరమైన అర్షదీప్‌కు కూడా తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోన్నట్లు సమాచారం. . ఈ రెండు మార్పులతో పాటు వాషింగ్టన్ సుందర్ స్థానంలో రమణ్‌దీప్ సింగ్, శివమ్ దూబేలలో తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
టాప్ ఆర్డర్...
మరోవైపు టాప్ ఆర్డర్‌లో సంజు శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లేమి టీమిండియాను ఇబ్బంది పెడుతోంది. వీరిద్దరు ఇప్పటివరకు ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయారు. తొలి టీ20లో మెరుపులు మెరిపించిన అభిషేక్ శర్మ...ఆ తర్వాతి మ్యాచుల్లో జోరు చూపించలేకపోయాడు. హార్దిక్ పాండ్య కూడా బ్యాటింగ్‌లో తడబడుతుండటం టీమిండియాను కలవరపెడుతోంది.
వరుణ్ చక్రవర్తి మినహా...
బౌలర్లు కూడా అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోవడం టీమిండియాకు మైనస్‌గా మారింది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మినహా మిగిలిన స్పిన్నర్లు, పేసర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. మూడో టీ20 ద్వారా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన షమి వికెట్ తీయలేకపోయాడు. రవి బిష్ణోయ్ కూడా పరుగుల్ని కట్టడి చేయడంలో విఫలం అవుతోన్నాడు.
మార్పులు...
ఇంగ్లండ్ కూడా తుది జట్టులో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. జాకబ్ బెథల్, సఖీబ్ మహమద్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తోన్నాయి. స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌కు చోటు ఇవ్వాలని ఇంగ్లండ్ మెనేజ్‌మెంట్ భావిస్తోన్నట్లు సమాచారం.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. నాలుగో టీ20లో టీమిండియా గెలిస్తే సిరీస్ సొంతం అవుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే 2-2తో సమం అవుతుంది. ఇండియా సిరీస్ గెలుస్తుందా? ఇంగ్లండ్ సిరీస్ సమం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.