IND vs ENG 3rd T20: మూడో టీ20కి తుది జట్టులో భారత్ ఈ మార్పు చేయనుందా! పిచ్ ఎలా ఉండొచ్చంటే..
IND vs ENG 3rd T20: ఇంగ్లండ్‍తో నేడు జరిగే మూడో టీ20 గెలిస్తే భారత్‍కు సిరీస్ కైవసం అవుతుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో టీమిండియా ఓ మార్పు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇరు తుదిజట్లు, పిచ్ ఎలా ఉండొచ్చో ఇక్కడ చూడండి.
ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍లో జోరు మీద ఉన్న భారత్ మూడో మ్యాచ్‍కు సిద్ధమైంది. ఐదు టీ20ల సిరీస్‍లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా నేడు (జనవరి 28) జరిగే ఈ మూడో పోరు గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. తొలి రెండు మ్యాచ్‍లు గెలిచిన జోరునే కొనసాగించాలని సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉండగా.. సిరీస్ నిలువుకోవాలనే కసి ఇంగ్లండ్‍లో ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 రాజ్‍కోట్ వేదికగా నేడు జరగనుంది.

తుదిజట్టులో ఈ మార్పు
ఈ టీ20 సిరీస్‍లో భారత్ దుమ్మురేపుతోంది. తొలి టీ20లో అలవోకగా విజయం సాధించింది. రెండో టీ20లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అజేయ అర్ధ శతకంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో రెండో టీ20లో టీమిండియా ఉత్కంఠ పోరులో గెలిచింది. అయితే, ఫస్ట్ టీ20 తర్వాత గాయపడిన మరో తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి.. సిరీస్‍కు దూరమయ్యాడు. దీంతో రెండో టీ20లో ధృవ్ జురెల్‌కు తుది జట్టులో చోటు దక్కింది. నితీశ్‍ను రిప్లేస్ చేసిన శివం దూబే అప్పటికి చెన్నై చేరుకోకపోవడంతో జట్టులోకి జురెల్ వచ్చాడు. ఈ మూడో టీ20లో మాత్రం జురెల్ స్థానంలో శివం దూబేను భారత్ తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ మార్పును టీమిండియా చేయొచ్చు. ఒకవేళ దూబేను కాకుండా రమణ్‍దీప్‍ను తీసుకోవాలన్నా జురెల్‍ను పక్కన పెట్టనుంది. చాలా కాలం తర్వాత టీమిండియాలోకి వచ్చిన మహమ్మద్ షమీకి ఈ మ్యాచ్ తుది జట్టులోనూ చోటు దక్కడం అనుమానమే.
పిచ్ ఇలా..
రాజ్‍కోట్‍లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టీ20 సాగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‍కు ఎక్కువగా అనుకూలించేలా కనిపిస్తోంది. పిచ్ ఫ్లాట్‍గా ఉండనుంది. మంచి స్కోర్లు నమోదు కావొచ్చు. పేసర్లకు కంటే స్పిన్నర్లకు పిచ్ కాస్త సహరించవచ్చు. పొగమంచు ప్రభావం ఉండటంతో టాస్ కీలకంగా ఉండనుంది. టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వొచ్చు.
మ్యాచ్ టైమ్, లైవ్ వివరాలు
ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టీ20 నేటి (జనవరి 28) సాయంత్రం 7 గంటలకు మొదలుకానుంది. అరగంట ముందు 6.30 గంటలకు టాస్ పడుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
మూడో టీ20కి భారత తుదిజట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే /రమణ్‍దీప్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
మూడో టీ20కి కూడా ఒకరోజు ముందే తుది జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. రెండో మ్యాచ్‍లో ఓడినా తుదిజట్టులో మార్పులు చేయలేదు. అదే టీమ్‍ను కొనసాగించింది.
ఇంగ్లండ్ తుదిజట్టు: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్సే, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్
సంబంధిత కథనం