T20 World Cup 2024 IND vs Canada: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో తొలి మూడు మ్యాచ్‍లు గెలిచిన టీమీండియా.. సూపర్-8కు చేరుకుంది. గ్రూప్-ఏలో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాపై వరుస మ్యాచ్‍ల్లో విజయం సాధించింది. లీగ్ దశలో తన చివరి మ్యాచ్‍లో నేడు (జూన్ 15) కెనడాతో భారత్ తలపడాల్సి ఉంది. అమెరికా ఫ్లోరిడాలోని లౌడర్‌హిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే, ఇదే స్టేడియంలో శుక్రవారం జరగాల్సిన అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ రద్దయింది. అలాగే, నేటి భారత్, కెనడా మ్యాచ్‍కు కూడా వర్షం ముప్పు ఉంది. ఆ వివరాలు ఇవే.
కెనడాతో మ్యాచ్ అంత ముఖ్యమైనది కాకపోవటంతో టీమిండియా తుదిజట్టులో ప్రయోగాలు చేయాలని భావిస్తోంది. కుల్దీప్ యాదవ్‍ను ఫైనల్ ఎలెవెన్‍లోకి తీసుకొని సూపర్-8కు ముందు అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓపెనర్‌గా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వరుసగా మూడు మ్యాచ్‍ల్లో విఫలమవటంతో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉంటాయా అనే ఉత్కంఠ కూడా ఉంది. కెనడాతో మ్యాచ్‍లో విజృభించి ఫామ్ అందుకోవాలని కోహ్లీ కూడా కసిగా ఉన్నాడు.
మరోవైపు ఈ టోర్నీలో ఐర్లాండ్‍పై గెలిచి సత్తాచాటింది కెనడా. అయితే, ఇప్పటికే రెండు ఓటములతో సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించింది. భారత్‍కు పోటీ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. అయితే, వర్షం ఈ మ్యాచ్‍కు ఆటంకాలు కలిగించేలా కనిపిస్తున్నాయి.
భారత్, కెనడా మ్యాచ్ జరిగే నేడు (జూన్ 15) ఫ్లోరిడా స్టేడియం వద్ద భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్.కామ్ పేర్కొంది. మ్యాచ్ జరిగే సమయానికిి వర్షం పడే అవకాశాలు 50 శాతం ఉంటాయని వెల్లడించింది. ఈ మ్యాచ్ ఫ్లోరిడా లోకల్ టైమ్ ప్రకారం ఉదయం 10.30 గంటలకు (భారత్‍లో రాత్రి 8 గంటలు) ప్రారంభం కావాల్సి ఉంది.
భారత్, కెనడా మ్యాచ్‍కు వర్షం ఆటంకం కల్పించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ భారీ వాన పడితే ఔట్ ఫీల్డ్ మరింత చిత్తడిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ వాన వల్ల అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ క్యాన్సిల్ అవగా.. ఔట్‍ఫీల్డ్ బాగా తడిచిపోయింది. దీంతో నేడు జరగాల్సిన భారత్, కెనడా మ్యాచ్‍కు వాన గండం ఎక్కువగానే ఉంది.
ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోయినా గ్రూప్-ఏలో భారత్ టాప్‍లో ఉంటుంది. అమెరికా కూడా ఇప్పటికే సెకండ్ ప్లేస్ ఖరారు చేసుకొని సూపర్-8కు చేరింది. ప్రపంచకప్‍లో అడుగుపెట్టిన తొలిసారే సూపర్-8 చేరి అద్భుతం చేసింది. గ్రూప్-ఏలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాకిస్థాన్ టోర్నీ నిష్క్రమించింది. భారత్‍తో మ్యాచ్ రద్దయితే కెనడా పాకిస్థాన్ ఓ ప్లేస్ పైన మూడో స్థానానికి చేరుతుంది.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో సూపర్-8, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‍లన్నీ వెస్టిండీస్ వేదికగా జరగనున్నాయి.
వాతావరణాన్ని మనం కంట్రోల్ చేయలేమని, అయితే కెనడాతో మ్యాచ్ జరగాలని తాము కోరుకుంటున్నట్టు భారత ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. “వాతావరణం చాలా సవాలుగా ఉంది. వాన ఎప్పుడు వస్తుందో చెప్పలేని విధంగా ఉంది. అయితే ఈ విషయాలన్నింటికీ మేం సిద్ధంగా ఉన్నాం. మేం ఏం కంట్రోల్ చేయగలమో వాటి గురించే ఆలోచిస్తున్నాం. పూర్తిగా సిద్ధమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నాం” అని దిలీప్ చెప్పారు.