IND vs BAN: బంగ్లాను చిత్తు చేసిన భారత్.. వామప్ మ్యాచ్‍లో అలవోకగా గెలుపు
IND vs BAN T20 World Cup 2024 Warm Up: టీ20 ప్రపంచకప్ 2024 వామప్ పోరులో టీమిండియా దుమ్మురేపింది. బంగ్లాదేశ్‍ను అలవోకగా చిత్తుచేసింది. ఆల్‍రౌండ్ షోతో భారత్ సత్తాచాటింది.
IND vs BAN: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీకి సన్నాహకంగా జరిగిన వామప్ పోరులో టీమిండియా దుమ్మురేపింది. అన్ని విభాగాల్లో అదరగొట్టి బంగ్లాదేశ్‍ను చిత్తుచిత్తుగా ఓడించింది. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా నేడు (జూన్ 1) జరిగిన టీ20 ప్రపంచకప్ వామప్ మ్యాచ్‍లో భారత్ 60 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‍పై విజయం సాధించింది. అసలు పోరుకు ముందు సన్నాహక మ్యాచ్‍లో రోహిత్ శర్మ సేన అదరగొట్టింది.
బంగ్లా విలవిల
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో 183 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ నానా తిప్పలు పడింది. ఏ దశలోనూ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. వరుసగా వికెట్లు చతికిలపడింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేయగలిగిన బంగ్లా ఓటమి పాలైంది.
తొలి ఓవర్లోనే బంగ్లాదేశ్ బౌలర్ సౌమ్య సర్కార్ (0)ను చేశాడు భారత పేసర్ అర్షదీప్ సింగ్. ఆ తర్వాత మూడో ఓవర్లో లిటన్ దాస్ (6)ను కూడా అర్షదీప్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాతి ఓవర్లోనే నజ్ముల్ హుసేన్ శాంతో (0)ను సిరాజ్ డకౌట్ చేశాడు. తౌహిద్ హ్రిదోయ్ (13) కూడా కాసేపటికే వెనుదిరిగాడు. నిలకడగా ఆడిన తంజిద్ హసన్ (17)ను తొమ్మిదో ఓవర్లో భారత స్టార్ హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. దీంతో 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ కూరుకుపోయింది.
నిలిచిన మహమ్మదుల్లా, షకీబ్
బంగ్లాదేశ్ ఆలౌట్ కాకుండా మహమ్మదుల్లా (28 బంతుల్లో 40 పరుగులు; 4 ఫోర్లు, ఓ సిక్స్), షకీబుల్ హసన్ (34 బంతుల్లో 28 పరుగులు) నిలిచారు. 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, గెలిపించేందుకు ఆడుతున్నట్టు కనిపంచలేదు. వికెట్లు కాపాడుకునేందుకే షకీబ్ ఆడాడు. వీరు పెవిలియన్ చేరాక.. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో బంగ్లాకు భారీ ఓటమి ఎదురైంది.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, శివం దూబే చెరో రెండు వికెట్లు తీశారు. జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అదరగొట్టిన పంత్, హార్దిక్
ఈ వామప్ పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. బ్యాటింగ్‍కు కష్టంగా ఉన్న పిచ్‍పై బ్యాటింగ్‍లో దుమ్మురేపింది. ఓపెనింగ్‍కు వచ్చిన సంజూ శాంసన్ (1) ఫెయిల్ అవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (23) కాసేపు నిలిచాడు. అయితే, సుమారు 16 నెలల తర్వాత టీమిండియాలోకి కమ్‍బ్యాక్ చేసిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్‍లో దుమ్మురేపాడు. 32 బంతుల్లోనే 53 పరుగులు బాది అర్ధ శతకంతో మెరిపించాడు. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో దుమ్మురేపాడు. ఈ సన్నాహక పోరులో ఇతర బ్యాటర్లకు అవకాశం ఇచ్చేందుకు హాఫ్ సెంచరీ తర్వాత పెవిలియన్‍కు రిటైర్డ్ ఔట్‍గా వెళ్లిపోయాడు పంత్.
సూర్య కుమార్ యాదవ్ (18 బంతుల్లో 31 పరుగులు) వేగంగా ఆడాడు. అయితే, శివమ్ దూబే 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసి నిరాశపరిచాడు. 15వ ఓవర్లో ఔటయ్యాడు. సూర్య కూడా ఆ తర్వాత వెనుదిరిగాడు. అయితే, చివర్లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 40 పరుగులు నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) హిట్టింగ్‍తో అదరగొట్టాడు. ఓ దశలో వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు. ఐపీఎల్‍లో పెద్దగా రాణించలేకపోయిన హార్దిక్.. ఈ మ్యాచ్‍తో ఫామ్‍ను అందుకున్నాడు. చివరి వరకు నిలిచాడు పాండ్యా. దీంతో భారత్‍కు 182 పరుగుల మంచి స్కోరు దక్కింది.
రేపటి నుంచి ప్రపంచకప్ పోరు
టీ20 ప్రపంచకప్ 2024 సమరం రేపు (జూన్ 2) షురూ కానుంది. తొలి మ్యాచ్‍లో అమెరికా, కెనడా తలపడనున్నాయి. 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. జూన్ 29వ తేదీ వరకు టోర్నీ సాగనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఈ టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇక, జూన్ 5న ఈ ప్రపంచకప్‍లో ఐర్లాండ్‍తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.