IND vs AUS: షమీ పాంచ్ పటాకా.. ఆసీస్‍ను కట్టడి చేసిన భారత్.. మోస్తరు టార్గెట్
IND vs AUS: తొలి వన్డేలో టీమిండియాకు మోస్తరు టార్గెట్‍ను ఆస్ట్రేలియా నిర్దేశించింది. భారత పేసర్ మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో సత్తాచాటాడు.
IND vs AUS: తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కట్టడి చేశారు. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో సత్తాచాటి.. ఆసీస్‍ను వణికించాడు. మూడు వన్డేల సిరీస్‍లో భాగంగా మొహాలీ వేదికగా నేడు (సెప్టెంబర్ 22) జరుగుతున్న తొలి మ్యాచ్‍లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ (5/51) అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. జస్‍ప్రీత్ బుమ్రా, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52) హాఫ్ సెంచరీ చేయగా.. జోష్ ఇన్‍గ్లిస్ (45) రాణించాడు. టీమిండియా ముందు 277 పరుగుల లక్ష్యం ఉంది.
ట్రెండింగ్ వార్తలు
ముందుగా బ్యాటింగ్‍కు దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్లోనే భారత పేసర్ మహమ్మద్ షమీ షాకిచ్చాడు. నాలుగో బంతికే ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (4)ను ఔట్ చేశాడు. అయితే, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (41) నిలకడగా ఆడారు. ఆచితూడి బ్యాటింగ్ చేశారు. దీంతో 11.1 ఓవర్లలో ఆసీస్ 50 పరుగుల మార్క్ దాటింది. ఆ తర్వాత వార్నర్ కాస్త జోరు పెంచాడు. 49 బంతుల్లో హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు. అయితే, 19వ ఓవర్లో వార్నర్‌ను ఔట్ చేసి బ్రేక్‍త్రూ ఇచ్చాడు భారత స్పిన్నర్ జడేజా. 22 ఓవర్లో అద్భుతమైన ఇన్ స్వింగర్ వేసి స్మిత్‍ను బౌల్డ్ చేశాడు షమీ. దీంతో 21.3 ఓవర్ల వద్ద 112 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఆసీస్.
ఆ తర్వాత మార్నస్ లబుషేన్ (39), కామెరాన్ గ్రీన్ (31) ఆసీస్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపారు. ఈ క్రమంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. లబుషేన్‍ను ఔట్ చేశాడు. అశ్విన్ వేసిన బంతి బీట్ కాగా.. లబుషేన్‍ను స్టంప్ చేశాడు కీపర్ కేఎల్ రాహుల్. ఆ తర్వాత వాన వల్ల ఆట కాసేపు ఆగింది. వర్షం తగ్గడంతో మళ్లీ మొదలైంది. అనంతరం గ్రీన్ తడబడి రనౌట్ అయ్యాడు. కాసేపు దూకుడుగా ఆడిన మార్కస్ స్టొయినిస్ (29)ను షమీ బౌల్డ్ చేశాడు. చివర్లో జోష్ ఇన్‍గ్లిస్ (45) రాణించాడు. అయితే అతడిని బుమ్రా పెవిలియన్‍కు పంపాడు. చివర్లో కెప్టెన్ (9 బంతుల్లో 21 నాటౌట్) దూకుడుగా ఆడటంతో ఆసీస్ 50 ఓవర్లలో 276 పరుగులు చేయగలిగింది. షార్ట్ (2), సీన్ అబాట్ (2) నిలువలేకపోయారు. చివరి బంతికి ఆడమ్ జంపా రనౌట్ అవటంతో ఆసీస్ ఆలౌటైంది.
సంబంధిత కథనం
టాపిక్