IND vs AUS 4th Test: బాక్సింగ్ డే టెస్ట్ - తొలిరోజు 311 పరుగులు చేసిన ఆస్ట్రేలియా - బుమ్రా మినహా భారత బౌలర్లు విఫలం
IND vs AUS 4th Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలిరోజు ఆస్ట్రేలియా దంచి కొట్టింది. ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులతో మొదటిరోజును ముగించింది. స్మిత్ 68 పరుగులతో నాటౌట్‌గా మిగలా...కాన్‌స్టాస్, లబుషేన్, ఖవావా హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీసుకున్నాడు.
బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా దంచికొట్టింది. టాప్ ఆర్డర్ రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 311 పరుగులు చేసింది. సీనియర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్ 68 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు పాట్ కమిన్స్ 8 పరుగులతో ఆడుతోన్నాడు.
వన్డే తరహాలో...
బాక్సింగ్ డే టెస్ట్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్నది. అరంగేట్రం బ్యాట్స్‌మెన్ సామ్ కాన్‌స్టాస్ వన్డే , టీ20 తరహాలోనే ధనాధన్ బ్యాటింగ్‌తో భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. 65 బాల్స్‌లోనే రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో అరవై పరుగులు చేశాడు. కాన్‌స్టస్ జోరుకు జడేజా అడ్డుకట్ట వేశాడు. జడేజా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా కాన్‌స్టస్ వెనుదిరిగాడు. ఆ తర్వాత లబుషేన్, ఖవాజా కలిసి ఆస్ట్రేలియా స్కోరును ముందుకు నడిపించారు.
క్రీజులో కుదురుకున్న వీరిద్దరు హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఆస్ట్రేలియా స్కోరును 150 పరుగులు దాటించారు. ఖవాజాను (57 రన్స్) ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు బుమ్రా. కానీ లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లకు చుక్కలుచూపించారు. చివరకు 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సుందర్ బౌలింగ్‌లో లబుషేన్ ఔటవ్వడంతో టీమిండియా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
బుమ్రా జోరు...
ఫస్ట్, సెకండ్ సెషన్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కనిపించగా మూడో సెషన్ లో టీమిండియా జోరు కొనసాగింది. మూడో సెషన్‌లో విజృంభించిన బుమ్రా హిట్టర్ ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌లను ఔట్ చేసి ఆస్ట్రేలియా దూకుడుకు అడ్డుకట్టవేశాడు. అలెక్స్ క్యారీని (41 బాల్స్‌లో 31 రన్స్) ఆకాష్ దీప్ పెవిలియన్‌కు పంపించాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లతో రాణించాడు. ఆకాష్ దీప్, సుందర్, జడేజాలకు తలో వికెట్ దక్కింది.
గిల్ స్థానంలో సుందర్...
బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా ఓ మార్పుతో బరిలో దిగింది. శుభ్‌మన్ గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-1 తో ఇండియా. ఆస్ట్రేలియా సమంగా ఉన్నాయి. మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది.