IND vs AUS 5th Test: మళ్లీ పాత కథే - ఐదో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ ఢమాల్ - కష్టాల్లో టీమిండియా
IND vs AUS 5th Test: ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడింది. 70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లితో పాటు గిల్, కేఎల్ రాహుల్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జైస్వాల్ కూడా నిరాశపరిచాడు. ప్రస్తుతం పంత్, జడేజా క్రీజులో ఉన్నారు.
ఐదో టెస్ట్‌లో మళ్లీ పాత కథే రిపీట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లి, శుభ్‌మన్‌గిల్, కేఎల్ రాహుల్‌తో పాటు ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు.
టీమిండియా బ్యాటింగ్...
సిడ్నీ టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐదో టెస్ట్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకోవడంతో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఓపెనర్‌గా వచ్చిన అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 11 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
జైస్వాల్ ఔట్...
ఏడో ఓవర్‌లో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. నాలుగో టెస్ట్ హీరో యశస్వి జైస్వాల్ ఔటయ్యాడు. బోలాండ్ బౌలింగ్‌లో వెబ్‌స్టర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరితాడు జైస్వాల్. రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ కూడా దారుణంగా నిరాశపరిచాడు.
క్రీజులో కుదురుకుంటున్న గిల్‌ను నాథన్ లైయాన్ బోల్తా కొట్టించాడు. 20 పరుగులు మాత్రమే చేసి గిల్ పెవిలియన్ చేరుకున్నాడు. ఆదుకుంటాడని అనుకున్న విరాట్ కూడా మరోసారి ఆఫ్‌సైడ్ బలహీనతకు బలయ్యాడు. 17 పరుగులు మాత్రమే చేశాడు. 72 పరుగులకే టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది.
పంత్...జడేజా...
ప్రస్తుతం రిషబ్ పంత్ 19 రన్స్, జడేజా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. 45 ఓవర్లలో 89 పరుగులు చేసింది టీమిండియా. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఇప్పటికే 2-1 తేడాతో వెనుకంజలో ఉంది. ఈ సిరీస్‌ను సమం చేసి పరువు కాపాడుకోవాలంటే ఐదో టెస్ట్‌లో తప్పనిసరిగా గెలవాల్సివుంది. తొలిరోజు ఆట చూస్తుంటే టీమిండియా గెలవడం కష్టంగానే కనిపిస్తోంది.
రోహిత్ శర్మ 31 పరుగులు...
కాగా ఈ ఐదో టెస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మను పక్కనపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్‌లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు టెస్టుల్లో కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే చేసింది. ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడటంతో రోహిత్ శర్మను టీమ్ మేనేజ్‌మెంట్ తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రోహిత్ స్వయంగా ఈ టెస్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జట్టు నుంచి తప్పించడంపై హర్ట్ అయిన రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతోన్నాయి. ఐదో టెస్ట్ నుంచి రోహిత్ శర్మతో పాటు పేసర్ ఆకాష్ దీప్‌ను తప్పించారు. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు.