IND vs AUS 5th Test: ఐదో టెస్ట్‌లో తడబడిన బ్యాటర్లు - తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే టీమిండియా ఆలౌట్
IND vs AUS 5th Test: ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియా 185 పరుగులకే ఆలౌటైంది. నలభై పరుగులతో రిషబ్ పంత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లి సహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అందరూ నిరాశపరిచారు.
IND vs AUS 5th Test: ఐదో టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 185 పరుగులకే కుప్పకూలింది. రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, గిల్ సహా టాప్ ఆర్డర్ మొత్తం దారుణంగా విఫలమైంది. నాలుగో టెస్ట్ హీరోలు యశస్వి జైస్వాల్‌తో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా రాణించలేకపోవడంతో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది.
కోహ్లి 17 రన్స్...
సిడ్నీ టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరం కావడంతో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. భారత టాప్ ఆర్డర్‌ను ఆస్ట్రేలియా పేసర్లు బోలాండ్‌తో పాటు స్టార్క్ దెబ్బకొట్టారు. 72 పరుగులకే విరాట్ కోహ్లి, జైస్వాల్‌తో పాటు కేఎల్ రాహుల్, గిల్ ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. గిల్ 20, కోహ్లి 17 పరుగులు చేయగా...కేఎల్ రాహుల్ 4 రన్స్‌తో దారుణంగా నిరాశపరిచాడు.
జడేజాతో కలిసి పంత్...
జడేజాతో కలిసి పంత్ టీమిండియా స్కోరును వంద పరుగులు దాటించాడు. ఆస్ట్రేలియా పేస్ ధాటిని ఎదుర్కొంటూ కేసుపు నిలిచారు. పంత్‌తో పాటు తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని ఒకే ఓవర్‌లో ఔట్ చేసి టీమిండియాకు పెద్ద షాకిచ్చాడు బోలాండ్. పంత్ నలభై పరుగులు చేయగా...నితీష్ పరుగుల ఖాతా తెరవకుండానే తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.
బుమ్రా ధనాధన్ ఇన్నింగ్స్...
చివరలో బుమ్రా మూడు ఫోర్లు, ఓ సిక్సర్లతో కాసేపు ఆస్ట్రేలియా బౌలర్లను ప్రతిఘటించాడు. బుమ్రా బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా ఈ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. బుమ్రా 17 బాల్స్‌లో 22 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు వికెట్లు తీసుకున్నారు.
ఫ్యాన్స్ విమర్శలు...
ఐదో టెస్ట్‌లో విఫలమైన టీమిండియా బ్యాటర్లపై విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాపై 2-1 తేడాతో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. తొలి టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించగా...రెండో, నాలుగో టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలిచింది. మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది.
టాపిక్