IND vs AUS 5th Test: ఆసీస్‍ను కూల్చేసిన భారత బౌలర్లు.. స్వల్ప ఆధిక్యం.. గ్రౌండ్ వదిలి వెళ్లిన బుమ్రా.. సారథిగా కోహ్లీ
IND vs AUS 5th Test: ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూల్చేశారు భారత బౌలర్లు. సమిష్టిగా సత్తాచాటారు. దీంతో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం సాధించింది. బుమ్రా బయటికి వెళ్లటంతో కోహ్లీ కెప్టెన్సీ చేశాడు.
ఆస్ట్రేలియాతో ఐదో టెస్టులో టీమిండియా బౌలర్లు సమిష్టిగా సత్తాచాటారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‍ను కుప్పకూల్చారు. దీంతో స్వల్ప ఆధిక్యం దక్కింది. భారత కెప్టెన్ జస్‍ప్రీత్ బుమ్రా మధ్యలో గాయం వల్ల గ్రౌండ్ బయటికి వెళ్లడంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేశాడు. బుమ్రా బయటికి వెళ్లిన తర్వాత కూడా మిగిలిన భారత బౌలర్లు సత్తాచాటారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజైన నేడు (జనవరి 4) తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 181 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. దీంతో టీమిండియాకు నాలుగు పరుగుల ఆధిక్యం దక్కింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
అదరగొట్టిన బుమ్రా, సిరాజ్
9 పరుగులకు ఓ వికెట్ ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటకు ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఆరంభంలోనే భారత స్టార్ పేసర్లు జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అదరగొట్టారు. మార్నస్ లబుషేన్ (2)ను బుమ్రా పెవిలియన్‍కు పంపాడు . నిలకడగా ఆడిన సామ్ కొన్‍స్టాస్ (23)ను మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. డేంజరెస్ ట్రావిస్ హెడ్ (4)ను కూడా కాసేపటికే ఔట్ చేసి ఆసీస్‍ను దెబ్బకొట్టాడు. దీంతో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.
వెబ్‍స్టర్ హాఫ్ సెంచరీ
ఆస్ట్రేలియా అరంగేట్ర బ్యాటర్ బయూ వెబ్‍స్టర్ (105 బంతుల్లో 57 పరుగులు) అదరగొట్టాడు. తన తొలి మ్యాచ్‍లోనే అర్ధ శతకం చేశాడు. మరో వైపు స్టీవ్ స్మిత్ (33) కూడా నిలకడగా ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా కాస్త కోలుకునేలా కనిపించింది.
ప్రసిద్ధి అదుర్స్.. రాణించిన నితీశ్
ఈ క్రమంలో ఆసీస్ బ్యాటర్ స్మిత్‍ను భారత యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేశాడు. స్లిప్‍లో రాహుల్ మంచి క్యాచ్ పట్టాడు. మొత్తంగా లంచ్ విరామ సమయానికి ఆసీస్ 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత గాయంతో గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లాడు భారత కెప్టెన్ బుమ్రా. దీంతో స్టాండిన్ కెప్టెన్‍గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. కాసేపు నిలకడగా ఆడిన అలెక్స్ కేరీ (21)ని ప్రసిద్ధ్ ఔట్ చేశాడు.
తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‍లో బ్యాట్‍తో నిరాశ పరిచినా.. బంతితో అదరగొట్టాడు. ప్యాట్ కమిన్స్ (10), మిచెల్ స్టార్క్ (1)ను వెనువెంటనే ఔట్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన వెబ్‍స్టర్‌ను ప్రసిద్ధ్.. స్కాట్ బోలాండ్ (9)ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 181 పరుగులకు రెండో సెషన్‍లో ఆసీస్ ఆలౌటైంది. టీమిండియాకు నాలుగు పరుగుల ఆధిక్యం దక్కింది.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలా మూడు వికెట్లతో సత్తాచాటారు. జస్‍ప్రీత్ బుమ్రా, నితీశ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. నేటి చివరి సెషన్‍లో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‍కు భారత్ బరిలోకి దిగనుంది.
బయటికి వెళ్లిన బుమ్రా.. కెప్టెన్‍గా కోహ్లీ
భారత స్టార్ బౌలర్, కెప్టెన్ జస్‍ప్రీత్ బుమ్రాకు గాయమైంది. దీంతో గ్రౌండ్ నుంచి అతడు బయటికి వెళ్లాడు. స్కానింగ్ చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లాడు. ఈ సిరీస్‍లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న బుమ్రాకు గాయం అవడం భారత జట్టుకు ఆందోళనగా మారింది. బుమ్రా బయటికి వెళ్లడంతో టీమిండియాకు స్టాండిన్ కెప్టెన్‍గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. బుమ్రా లేకపోయినా మిగిలిన బౌలర్లు అదరగొట్టి ఆసీస్‍ను కుప్పకూల్చారు.