Ind vs Aus 5th Test: రోహిత్ శర్మ ఔట్.. శుభ్‌మన్ గిల్ ఇన్.. ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు తుది జట్టులో భారీ మార్పులు?
Ind vs Aus 5th Test: ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదో టెస్టు కోసం టీమిండియా తుది జట్టులో నుంచి కెప్టెన్ రోహిత్ శర్మనే పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మొత్తంగా తుది జట్టులో మూడు మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
Ind vs Aus 5th Test: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా.. చివరిదైన ఐదో టెస్టుకు తుది జట్టులో కీలకమైన మార్పులు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ కు ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మనే పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అతడు జట్టులో ఉంటాడా అన్న ప్రశ్నకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సమాధానం దాటవేయడం ఈ అనుమాలను మరింత బలపరుస్తోంది. అటు రిషబ్ పంత్ పైనా వేటు పడనున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ ఔట్.. శుభ్‌మన్ గిల్ ఇన్..
సాధారణంగా మ్యాచ్ కు ముందు కెప్టెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు రావడం ఆనవాయితీ. కానీ సిడ్నీ టెస్టుకు ముందు మాత్రం రోహిత్ బదులు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఉంటాడా అని ప్రశ్నించగా.. దీనికి నేరుగా సమాధానం చెప్పకుండా పిచ్, కండిషన్స్ చూసిన తర్వాత తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటామని గంభీర్ అనడం గమనార్హం. దీంతో రోహిత్ ను చివరి టెస్టులో పక్కన పెట్టడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రోహిత్ లేకపోతే అతని స్థానంలో శుభ్‌మన్ గిల్ జట్టులోకి రానున్నాడు. అతడు నెట్స్ లో కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు.
రోహిత్ లేకపోతే మరోసారి యశస్వితో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. మూడో స్థానంలో గిల్ వస్తాడు. అటు మెల్‌బోర్న్ టెస్టులో నిర్లక్ష్యపు షాట్లతో అందరి విమర్శలు ఎదుర్కొన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కూడా పక్కన పెట్టి అతని స్థానంలో ధృవ్ జురెల్ ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ గాయపడినట్లు గంభీర్ చెప్పాడు. దీంతో ఆ మార్పు అయితే తప్పనిసరి. అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ లేదా హర్షిత్ రాణా జట్టులోకి రానున్నారు.
రోహిత్ చెత్త ఫామ్.. విమర్శలు
రోహిత్ శర్మ ఇటు బ్యాట్ తో, అటు కెప్టెన్ గానూ వరుసగా విఫలమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రోహిత్ తన చివరి 15 టెస్టు ఇన్నింగ్స్ లో కేవలం 164 రన్స్ మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. ఇక ఆస్ట్రేలియా టూర్లో మూడు టెస్టుల్లో కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. అతని సగటు కేవలం 6.2 మాత్రమే. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన జట్ల కెప్టెన్లలో ఇదే అతి తక్కువ కావడం గమనార్హం.
దీంతో చివరి టెస్టుకు రోహిత్ పై వేటు దాదాపు ఖాయమే. అతడు లేకపోతే బుమ్రానే కెప్టెన్సీ చేపట్టనున్నాడు. తొలి టెస్టులో అతని కెప్టెన్సీలోనే పెర్త్ లో అనూహ్య విజయం సాధించింది టీమిండియా. దీంతో సిడ్నీ టెస్టులోనూ జట్టును గెలిపించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకోవడంతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశం సజీవంగా ఉంచే బాధ్యత అతనిపై ఉండనుంది.
టీమిండియా తుది జట్టు ఇదేనా?
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ/హర్షిత్ రాణా, బుమ్రా, సిరాజ్