IND vs AUS 5th Test: చేతులెత్తేసిన టీమిండియా లోయర్ ఆర్డర్.. ఆస్ట్రేలియాకు స్వల్ప టార్గెట్.. బోలాండ్‍కు ఆరు వికెట్లు
IND vs AUS 5th Test: ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‍లో టీమిండియా విఫలమైంది. మూడో రోజైన నేడు లోయర్ ఆర్డర్ త్వరగా కుప్పకూలింది. దీంతో ఈ చివరి టెస్టులో ఆస్ట్రేలియా ముందు స్వల్ప టార్గెట్ నిలిచింది.
ఆస్ట్రేలియాతో కీలకమైన ఐదో టెస్టులో భారత్ మరోసారి తడబడింది. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‍లోనూ విఫలమైంది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న సిరీస్ ఆఖరి టెస్టులో కష్టాల్లో పడింది. మ్యాచ్ మూడో రోజైన నేడు (జనవరి 5) రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే భారత్ ఆలౌటైంది. 6 వికెట్లకు 141 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బరిలోకి దిగిన టీమిండియా కేవలం 16 పరుగులే చేసి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు నిలువలేకపోయారు. ఆస్ట్రేలియా ముందు 162 పరుగుల టార్గెట్ ఉంది. ఎలా సాగిందంటే..
టపాటపా వికెట్లు
మూడో రోజు ఆటను భారత ఆల్‍రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మొదలుపెట్టారు. 141/6 ఓవర్ నైట్ స్కోరుతో జట్టు మంచి స్థితిలోనే ఉన్నట్టు కనిపించింది. అయితే కాసేపటికే నాలుగు వికెట్లను భారత్ కోల్పోయింది. ముందుగా ఆసీస్ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్‍లో జడేజా (13) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే వాషింగ్టన్ సుందర్ (12) కూడా పెవిలియన్ చేరాడు. పెద్దగా పరుగులు రాబట్టకుండానే ఇద్దరూ ఔట్ అయ్యారు.
ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. మహమ్మద్ సిరాజ్ (4), జస్‍ప్రీత్ బుమ్రా (0) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. ఆ ఇద్దరినీ ఆసీస్ పేసర్ బోలాండ్ ఔట్ చేశాడు. దీంతో 157 పరుగులకే భారత్ కుప్పకూలిపోయింది. మూడో రోజు కేవలం 16 పరుగులే జోడించి 4 వికెట్లను కోల్పోయి ఆలౌటైంది భారత్.
దుమ్మురేపిన బోలాండ్
ఆస్ట్రేలియా పేసర్ బోలాండ్ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లను పడగొట్టాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. వెబ్‍స్టర్‌కు ఒకటి దక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లతో బోలాండ్ దుమ్మురేపాడు. మొత్తంగా ఈ మ్యాచ్‍లో 11 వికెట్లను కైవసం చేసుకొని సత్తాచాటాడు. ఆస్ట్రేలియా ముందు 162 పరుగుల టార్గెటే ఉంది.
ఓడితే సిరీస్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు ఖతం
ఐదో టెస్టు మూడో రోజైన నేడే ముగిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆఖరిదైన ఈ టెస్టులో ఓడిపోతే 3-1తో సిరీస్‍ను టీమిండియా కోల్పోతుంది. అలాగే, ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (డబ్ల్యూటీసీ) ఆశలు కూడా పూర్తిగా ముగిసిపోతాయి. పిచ్ బౌలింగ్‍కు అనుకూలంగా ఉన్నా.. టాల్గెట్ తక్కువగా ఉండటంతో భారత బౌలర్లకు సవాలే ఇది.
రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (33 బంతుల్లో 61 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా.. మిగిలిన భారత బ్యాటర్లు విఫలమయ్యారు.