IND vs AUS 5th Test: భారత టాపార్డర్ విఫలం.. ఆసీస్ బౌలర్లపై పంజా విసిరిన పంత్.. ముగిసిన రెండో రోజు.. ఆధిక్యం ఎంతంటే..
IND vs AUS 5th Test: ఆస్ట్రేలియాతో ఐదో టెస్టుపై టీమిండియా కాస్త పట్టు బిగించింది. రెండో రోజు ఆసీస్‍ను త్వరగానే ఆలౌట్ చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‍లోనూ టీమిండియా తడబడింది. అయితే పంత్ ఫైరింగ్ హాఫ్ సెంచరీ చేశాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదో టెస్టు మరింత రసవత్తరంగా మారింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ ఆఖరు మ్యాచ్‍లో రెండో రోజైన నేడు (జనవరి 4) బౌలింగ్‍లో టీమిండియా సత్తాచాటింది. ఆసీస్‍ను తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూల్చింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత టాపార్డర్ విఫలమైంది. రిషబ్ పంత్ (33 బంతుల్లో 61 పరుగులు; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దుమ్మురేపే హాఫ్ సెంచరీ చేశాడు. హిట్టింగ్ మోత మోగించాడు. దీంతో టీమిండియా మంచి స్థితిలో ఉంది. రెండో రోజు ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 141 పరుగుల వద్ద భారత్ నిలిచింది. 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ఎలా సాగిందంటే..
భారత బౌలర్లు సూపర్.. ఆసీస్ ఢమాల్
ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లను నేడు రెండు సెషెన్లలోనే భారత బౌలర్లు కూల్చేశారు. 9/1 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఆసీస్‍ను 181 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియాకు నాలుగు పరుగుల ఆధిక్యం దక్కింది. భారత్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ తలా మూడు వికెట్లతో రాణించారు. జస్‍ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత టీమిండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‍కు దిగింది.
టాపార్డర్ మళ్లీ విఫలం
మూడో సెషన్‍లో భారత్ రెండో ఇన్నింగ్స్ షురూ చేసింది. ఆసీస్ బౌలర్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) నాలుగు ఫోర్లు బాది జోరు చూపాడు. అయితే, కాసేపటికే కేఎల్ రాహుల్ (13) భారీ షాట్‍కు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. యశస్వి (22)ని కూడా బోలాండ్ పెవిలియన్ పంపాడు. అతడి బౌలింగ్‍లోనే విరాట్ కోహ్లీ (6) కూడా ఔటయ్యాడు. దీంతో చాలా నిరుత్సాహపడ్డాడు. కాసేపటికే శుభ్‍మన్ గిల్ (13)ను ఆసీస్ అరంగేట్ర బౌలర్ వెబ్‍స్టర్ పెవిలియన్ పంపాడు. దీంతో 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత్.
హిట్టింగ్‍తో పంజా విసిరిన పంత్
భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్.. తన పంజా విసిరాడు. తొలి ఇన్నింగ్స్‌లో నిదానంగా ఆడిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో తన మార్క్ దూకుడుతో రెచ్చిపోయాడు. అప్పటికే నాలుగు వికెట్లు పడినా.. బెదరకుండా ఆస్ట్రేలియా బౌలర్లపై భారీ షాట్లతో పంత్ విరుచుకుపడ్డాడు. వరుసగా బౌండరీలు, సిక్స్‌లతో చెలరేగాడు. కేవలం 33 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు పంత్. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో దుమ్మురేపాడు. టెస్టులో టీ20 స్టైల్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరాడు పంత్. ఆ తర్వాత కూడా జోరు చూపాడు. అయితే, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‍లో భారీ షాట్‍కు ప్రయత్నించి కీపర్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు పంత్. భారత్‍కు అత్యంత ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఉన్నంతసేపు ఆసీస్ ప్లేయర్లను వణికించేశాడు. విమర్శలకు తన బ్యాట్‍తోనే ఆన్సర్ చెప్పేశాడు పంత్. ఇతర బ్యాటర్లు తడబడిన పిచ్‍పై 184.84 స్టైక్ రేట్‍తో వీరంగం చేసి సత్తాచాటాడు.
నితీశ్ ఔట్.. క్రీజులో జడేజా, సుందర్
గత మ్యాచ్ సెంచరీ హీరో, తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి (4) త్వరగానే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా (8 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (6 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో 6 వికెట్లకు 141 పరుగుల వద్ద రెండో రోజును టీమిండియా ముగించింది. 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. రేపు మూడో రోజు ఆటను జడేజా, సుందర్ కొనసాగించనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ మరోసారి దుమ్మురేపాడు. నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. నయా పేసర్ వెబ్‍స్టర్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. రెండో ఆటలో రెండు జట్లవి కలిపి మొత్తంగా 15 వికెట్లు పడ్డాయి.
ఐదు టెస్టుల సిరీస్‍లో ఆస్ట్రేలియా 2-1తో ముందంజలో ఉంది. దీంతో ఈ ఐదో టెస్టు గెలిచి సిరీస్ డ్రా చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ ఆఖరి టెస్టులో రేపు (జనవరి 5) మూడో రోజు ఆట అత్యంత కీలకంగా ఉండనుంది.
భారత్‍కు గుడ్‍న్యూస్
భారత కెప్టెన్ జస్‍ప్రీత్ బుమ్రా.. బౌలింగ్ సమయంలో గాయపడి రెండో రోజు లంచ్ సమయంలో గ్రౌండ్ బయటికి వెళ్లాడు. స్కానింగ్ కోసం ఆసుపత్రికి బయలుదేరాడు. దీంతో స్టాండిన్ కెప్టెన్‍గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. అయితే, భారత్ బ్యాటింగ్‍కు దిగిన సమయంలో డ్రెస్సింగ్ రూమ్‍లో బమ్రా కనిపించాడు. దీంతో అతడి గాయం పెద్దది కాదని తెలుస్తోంది. అతడు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో టీమిండియా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది.
సంబంధిత కథనం